LOADING...
Venky Anil 5 : వెంకటేష్‌కు డబుల్ రోల్? మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైన అనిల్ రావిపూడి!
వెంకటేష్‌కు డబుల్ రోల్? మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైన అనిల్ రావిపూడి!

Venky Anil 5 : వెంకటేష్‌కు డబుల్ రోల్? మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైన అనిల్ రావిపూడి!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 20, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి ఒక వినోదాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం ఇప్పుడు ఓ ఆనవాయితీలా మారింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, వచ్చే సంక్రాంతికీ మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కథను పూర్తి చేసి, కొత్త మల్టీస్టారర్ చిత్రాన్ని పట్టాలెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఇటీవల ఘనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ సినిమాలో వెంకటేష్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మరోసారి వెంకటేష్‌ను కొత్తగా చూపించేందుకు అనిల్ ప్రయత్నిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

వివరాలు

వెంకటేష్ ద్విపాత్రాభినయం..

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఒక పాత్రలో కుటుంబానికి అంకితమైన వ్యక్తిగా కనిపించనున్న ఆయన, మరో పాత్రలో యాక్షన్ ప్రధానమైన శక్తివంతమైన పాత్రలో అలరించనున్నారట. ఈ రెండు భిన్నమైన పాత్రలు చిత్రానికి మరింత ఆకర్షణ తీసుకురావడం ఖాయమని అంటున్నారు. అలాగే కీర్తి సురేష్-వెంకటేష్, కృతి శెట్టి-కల్యాణ్ రామ్ జంటల పాత్రల విషయంలోనూ ఆసక్తికరమైన మలుపులు ఉండనున్నాయనే ప్రచారం సాగుతోంది.

వివరాలు

అభిమానుల్లో మరింత ఆసక్తి..

ఒకవేళ వెంకటేష్ ద్విపాత్రాభినయం వార్త నిజమైతే, అది ఆయన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన ప్రయోగంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా కుటుంబ కథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో డబుల్ రోల్ అంశం చేరితే, వినోదంతో పాటు యాక్షన్, భావోద్వేగాలకు కూడా మంచి ప్రాధాన్యం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 22 నుంచి ప్రారంభం కానుండటంతో, వెంకటేష్ డబుల్ రోల్‌పై వస్తున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వార్త నిజమేనా? లేక కేవలం ప్రచారానికే పరిమితమా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Advertisement