జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయాలనుందని చెప్పిన హాలీవుడ్ డైరెక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళికి థాంక్స్ చెప్పాల్సిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్ళి, ప్రపంచ సినిమా పటంలో తెలుగు సినిమాను శిఖరాగ్రాన నిలిపాడు రాజమౌళి. ఈ కారణంగానే ప్రస్తుతం హాలీవుడ్ దర్శకులు సైతం తెలుగు సినిమా వైపు చూస్తున్నారు.
తాజాగా మార్వెల్ స్టూడియోస్ కు సంబంధించిన గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్-3 దర్శకుడు, జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయాలనుందని తెలియజేశాడు.
గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సినిమా, మే 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొన్న దర్శకుడు జేమ్స్ గన్, ఈ విషయాన్ని తెలియజేశాడు.
Details
పులితో ఫైట్ చేసిన హీరోతో చేయాలనుందని చెప్పిన దర్శకుడు
భారతదేశానికి చెందిన ఏ నటులతో సినిమా తీయాలని ఉందని, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ప్రమోషన్లలో జేమ్స్ గన్ ను అడగడంతో, ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఫైట్ చేసే హీరోతో పని చేయాలనుందని తెలియజేశాడు.
కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని జేమ్స్ గన్ ప్రశంసించాడు. ఈ విషయమై ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, గతంలో ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ సినిమాల్లో నటించాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కార్యక్రమం తర్వాత ఇచ్చిన ఒకానొక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, మార్వెల్ సినిమాల్లో నటించాలని ఉందని అన్నాడు.
మరోవైపు రాంచరణ్ కూడా తాను నటించబోయే హాలీవుడ్ సినిమా గురించి త్వరలో వెల్లడి చేస్తానని తెలియజేసిన సంగతి తెలిసిందే.