Raviteja : అయ్యప్ప భక్తుడిగా రవితేజ.. 'ఇరుముడి'లో ఐకానిక్ అయ్యప్ప సాంగ్ రీమిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇరుముడి'. దర్శకుడు శివ నిర్వాణ రూపుదిద్దుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాలో ప్రముఖ భక్తి గీతం "విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు.. ఎక్కినాడు బంగారు పల్లకి" పాటను రీమిక్స్ రూపంలో తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
వివరాలు
రవితేజ ఎనర్జీకి ఐకానిక్ సాంగ్..
ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆ నేపథ్యానికి తగ్గట్టుగా భక్తుల్లో విశేష ఆదరణ పొందిన "ఎక్కినాడు పల్లకి.. బంగారు పల్లకి" పాటను కొత్త తరానికి తగ్గ శైలిలో మళ్లీ అందించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. అభిమానుల నుంచి ఈ పాట రీమిక్స్‌పై విపరీతమైన డిమాండ్ రావడంతో, మరింత ఉత్సాహభరితంగా ఈ క్లాసిక్ ట్రాక్‌ను రీక్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. రవితేజ ఎనర్జీకి ఈ ఐకానిక్ సాంగ్ జతకావడంతో థియేటర్లలో ప్రత్యేకమైన హంగామా ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
వివరాలు
తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడా?
భక్తి అంశాలతో పాటు బలమైన తండ్రి-కూతురు భావోద్వేగాల చుట్టూ కూడా 'ఇరుముడి' కథ నడవనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాతో రవితేజ మరో భారీ విజయాన్ని అందుకుని తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.