Happy Birthday Priyadarshi: ప్రియదర్శి కెరీర్‌ని మలుపు తిప్పిన ఆ మూడు సినిమాలు
ప్రియదర్శి.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ నటుడి పూర్తి పేరు ప్రియదర్శి పులికొండ. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి, 2016లో టెర్రర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రియదర్శి, ఆగస్టు 25న పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ప్రియదర్శి కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. పెళ్ళి చూపులు: 2016లో రిలీజైన ఈ చిత్రం ప్రియదర్శికి బిగ్ బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను తరుణ్ భాస్కర్ తెరకెక్కించారు. ఈ సినిమాలో విపరీతంగా నవ్వించిన ప్రియదర్శి, నా సావు నేను సస్తా అనే డైలాగ్ తో ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు.
మల్లేశంలో మంచి గుర్తింపు
ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవిత కథగా వచ్చిన ఈ సినిమాలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి కనిపించాడు. అప్పటివరకూ కామెడీ పాత్రలే చేసిన ప్రియదర్శి, మొదటిసారిగా హీరోగా సీరియస్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి నటనలోని మరో కోణం ఆవిష్కృతం అవుతుంది. కామెడీ మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రల్లోనైనా ప్రియదర్శి నటించగలడని చూపించిన చిత్రమిది. ఈ సినిమాను రాజ్ ఆర్ తెరకెక్కించగా, అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
బలగంతో మరో మెట్టు ఎక్కిన ప్రియదర్శి
బలగం సినిమా రిలీజయ్యే వరకూ ఎవ్వరికీ తెలియదు. చాలా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రభంజనంలా మారి బాక్సాఫీసు వద్ద కోట్లు కొల్లగొట్టింది. ప్రియదర్శి కెరీర్లో సోలో హీరోగా అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రమిదే. జాతి రత్నాలు సినిమా బలగం కంటే మంచి విజయం సాధించినప్పటికీ ఆ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు, హీరో నవీన్ పోలిశెట్టికి వెళ్ళిపోయింది. బలగం సినిమాలో ప్రియదర్శి పాత్ర నవ్వులు నవ్విస్తూనే చివర్లో ఏడిపిస్తుంది. ప్రియదర్శికి సోలోగా తిరుగులేని హిట్ ఇచ్చిన ఈ సినిమా, ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.