Happy birthday Ramyakrishna: పాత్రేదైనా, ఘట్టమేదైనా రమ్యకృష్ణ దిగనంత వరకే
రమ్యకృష్ణ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినిమా ప్రేక్షకుడికి బాహుబలి గుర్తొస్తుంది. శివగామిగా ఆమె కనబర్చిన నటన అందరినీ ఆకట్టుకుంది. అటు తల్లిగా పిల్లలను లాలిస్తూనే ఇటు రాజమాతగా రాజ్యాన్ని పాలించే శివగామిగా రమ్యకృష్ణ నటన శిఖరాగ్రాన నిలిచింది. రమ్యకృష్ణ స్టయిలే అలా ఉంటుంది. పొగరుబట్టిన పట్నం పిల్లలా చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించగలరు, అలాగే అమాయకత్వం నిండిన పల్లెటూరి అమ్మాయిలా ప్రేక్షకుల్లో జాలి పుట్టించగలరు. రెండు విభిన్న పార్శ్వాల్లో కనిపించినా ప్రేక్షకులను కనెక్ట్ చేయడం ఆమెకు తెలిసిన విద్య. ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సూత్రధారులు సినిమాతో నటిగా పేరు
90వ దశకంలో గ్లామర్ క్వీన్ గా తెలుగు, తమిళం ఇండస్ట్రీలను ఒంటిచేత్తో ఏలిన రమ్యకృష్ణ, 1985లో భలేమిత్రులు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరీర్ తొలినాళ్ళలో రమ్యకృష్ణకు హీరోయిన్ గా హిట్స్ దక్కలేదు. ఆమె నటించిన చాలా సినిమాలు ఫ్లాపులుగా మారాయి. దాంతో ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. కే విశ్వనాథ్ దర్శకత్వంలో నటిగా పేరు: ఐరన్ లెగ్ ముద్ర పడిపోయిన సమయంలో కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు సినిమా, రమ్యకృష్ణకు నటిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడు గారు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా కే రాఘవేంద్రరావు తెరకెక్కించారు
అల్లుడు గారు సినిమాతో స్టార్ స్టేటస్
అల్లుడు గారు సినిమా తర్వాత రమ్యకృష్ణ వెనుదిరిగి చూసుకోలేరు. వరుసగా విజయాలు వస్తూనే ఉన్నాయి. కే రాఘవేంద్రరావు, రమ్యకృష్ణ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో డజనుకు పైగా సినిమాలు వచ్చాయి. అమ్మోరు సినిమాతో ఊగిపోయిన జనం: కోడి రామకృష్ణ దర్శకత్వంలోని అమ్మోరు సినిమాలో అమ్మోరు గా రమ్యకృష్ణను చూసి తెలుగు ప్రేక్షకులు హారతులు పట్టారు. దేవతగా చాలా సినిమాల్లో రమ్యకృష్ణ కనిపించారు. నరసింహలో నట విశ్వరూపం: రజనీకాంత్ సరసన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ విశ్వరూపం చూపించారు. లేడీ విలన్ గా ఆమె కనబరిచిన నటన ఎప్పటికీ గుర్తుంటుంది.
రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం
విభిన్నమైన పాత్రలు, కొత్త కొత్త కథల్లో కనిపించిన రమ్యకృష్ణ, ఇప్పటికీ నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన జైలర్ సినిమాలో రమ్యకృష్ణ నటించారు. మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమాలోనూ నటిస్తున్నారు. హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసిన తర్వాత మళ్ళీ అంతటి స్థాయి బాహుబలి సినిమాతో రావడంతో వరుసగా తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారు.