ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలుగు ప్రేక్షకులను తన ప్రేమ కథలతో మాయ చేసి, మైమరిపించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మాతృబాష మలయాళం అయినా "మిన్నల్" అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు గౌతమ్ మీనన్. 2004లో వెంకటేష్ నటించిన "ఘర్షణ" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు. ఆ తర్వాత అతను తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్ లేదా రీమేక్ కావడం మొదలయ్యాయి. అలా డబ్ అయిన సినిమా "సూర్య s/o కృష్ణన్" ఈ సినిమా సూర్యకు తెలుగులో మార్కెట్ ను సంపాదించి పెట్టింది, అంతేకాదు తెలుగమ్మాయి అయిన సమీరా రెడ్డికి తెలుగులో ఒక మర్చిపోలేని హిట్ ను ఇచ్చింది.
"ఏ మాయ చేసావే" తో సమంతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన గౌతమ్ మీనన్
ఇక 2010లో వచ్చిన "ఏ మాయ చేసావే" తో సమంతను పరిచయం చేయడమే కాదు, సమంత, నాగచైతన్య జంటకు క్రేజ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత "ఎటో వెళ్ళిపోయింది మనసు" , "సాహసం శ్వాసగా సాగిపో" వంటి విభిన్న ప్రేమ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే 2016లో "సాహసం శ్వాసగా సాగిపో" సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ దర్శకత్వం చేయలేదు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో "పుత్తుమ్ పుదు కాలై", "కుట్టి స్టోరీ" వంటి ఆంథాలజీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే "పావై కథగల్" అనే ఆంథాలజీ సిరీస్ లో కూడా నటించారు. గౌతమ్ మీనన్ మరికొన్ని విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలని కోరుకుందాం.