వెంకీ అట్లూరి బర్త్ డే: సార్ సినిమా దర్శకుడు ఇంతకుముందు హీరోగా చేసాడని తెలుసా?
వెంకీ అట్లూరి.. తమిళ హీరో ధనుష్ తో తెలుగులో సినిమా తెరకెక్కించిన దర్శకుడు. అప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ని సార్ తో డైరెక్టుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. సార్ సినిమా బాక్సాఫీసు దగ్గర రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈరోజు వెంకీ అట్లూరి తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి సినిమాల గురించి మాట్లాడుకుందాం. వెంకీ అట్లూరి మొదటగా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2007లో జ్ఞాపకం సినిమాలో హీరోగా కనిపించాడు. స్నేహగీతం సినిమాకు మాటలు రాయడమే కాకుండా ఒకానొక పాత్రలో నటించాడు. స్నేహగీతం తర్వాత మళ్ళీ నటన వైపు వెళ్ళలేదు. రచయితగా ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత సినిమాలకు పనిచేసాడు.
తొలిప్రేమతో దర్శకుడిగా వెంకీ అట్లూరి
తొలిప్రేమ: వరుణ్ తేజ్, రాశీ ఖనా హీరో హీరోయిన్లుగా విడుదలైన తొలిప్రేమ చిత్రంతో దర్శకుడిగా వెంకీ అట్లూరి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలోని పాటలు, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మిస్టర్ మజ్ను: అక్కినేని అఖిల్ హీరోగా విడుదలైన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేసింది. బంధాలు అంటే భయపడే కుర్రాడు, హీరోయిన్ తో రిలేషన్ లోకి వెళ్ళాలా వద్దా అన్న సంధిగ్ధంలో ఏం చేసాడన్నదే ఈ సినిమా కథ. రంగ్ దే: చిన్నప్పటి నుండి పక్క ఇళ్ళలో పెరిగే అమ్మాయి, అబ్బాయి అనుకోని పరిస్థితుల్లో భార్యా భర్తలు అవుతారు. వీరి పెళ్ళి జీవితం ఎలా సాగిందనేదే కథ. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ నటించారు.
ప్రేమకథలకు సార్ తో ఫుల్ స్టాప్
దర్శకుడిగా వెంకీ అట్లూరి తీసిన సినిమాలన్నీ ప్రేమకథలే. దాంతో వెంకీ అట్లూరి వేరే కథలు తీయలేడేమోనన్న సందేహం అందరిలోనూ కలిగింది. ఇలాంటి టైమ్ లోనే సార్ సినిమాతో వచ్చాడు. విద్యను ప్రైవేటీకరణ చేద్దామనుకునే విలన్లను ఎదుర్కొని పిల్లలకు పాఠాలు చెప్పిన మాస్టారు కథే సార్. తమిళంలో ఈ సినిమా, వాతి అన్న పేరుతో రిలీజైంది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మించింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.