మళయాళీ హీరోయిన్లను ఇరవై ఏళ్ళుగా భరిస్తున్నాం అంటూ హరీష్ శంకర్ కామెంట్లు
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఉగ్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కి అతిధిగా విచ్చేసిన హరీష్ శంకర్, మళయాళీ హీరోయిన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఉగ్రం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మిర్ణా మీనన్ గురించి మాట్లాడుతూ, మళయాళీ హీరోయిన్లను ఇరవై ఏళ్ళుగా భరిస్తున్నామని, మీరు కూడా మరో ఇరవై ఏళ్ళు తెలుగులో నటించాలని అన్నాడు. అయితే అక్కడే యాంకర్ సుమ ఉండడంతో, ఇరవై ఏళ్ళుగా మళయాళీ అమ్మాయిలను ఇండస్ట్రీలో చూస్తున్నామని కామెడీగా అన్నాడు. యాంకర్ గా ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న సుమపై అప్పుడప్పుడు కామెడీ కౌంటర్లు పడుతుంటాయి. హరీష్ శంకర్ కూడా అదే ఉద్దేశ్యంతో అన్నట్లు అర్థమవుతోంది.
సుకుమార్ మాటలకు మనసులో వెలితి
ఈ ఈవెంట్ లో తన శిష్యుడు, ఉగ్రం సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల గురించి మాట్లాడిన హరీష్ శంకర్, తన దగ్గరున్న అసిస్టెంట్లు దర్శకులుగా ఎందుకు మారడం లేదని ఒకసారి సుకుమార్ అడిగారని అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా, మీరంటే సీనియర్లనీ మీ దగ్గర ఎక్కువ మంది అసిస్టెంట్లు ఉంటారని కవర్ చేసేవాడినని, కాకపోతే మనసులో ఏదో ఒక వెలితి ఉండేదని, తన దగ్గరున్న వాళ్ళు డైరెక్టర్లుగా ఎందుకు మారలేకపోతున్నారనే చిన్న బాధ ఉండేదని, ఆ బాధ విజయ్ కనకమేడల తీర్చేసాడని అన్నాడు హరీష్ శంకర్. ఉగ్రం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. మే 5వ తేదీన సినిమా విడుదల అవుతుంది.