హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?
బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ, ప్రస్తుతం హత్య అనే సినిమాతో వచ్చాడు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాను కె బాలాజీ కుమార్ డైరెక్ట్ చేసారు. కథ: ఫేమస్ మోడల్ లైలా(మీనాక్షి చౌదరి) హత్యకు గురవుతుంది. ఈ హత్య కేసు ఐపీఎస్ ఆఫీసర్ సంధ్య(రితికా సింగ్) దగ్గరకు వస్తుంది. ఈ కేసును డీల్ చేసేందుకు డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) హెల్ప్ తీసుకుంటుంది సంధ్య. ఈకేసులో మీనాక్షి బాయ్ ఫ్రెండ్, మోడల్ కో ఆర్డినేటర్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, బబ్లూ అనే వ్యక్తుల మీద అనుమానం ఉంటుంది. ఆ అనుమానాలను క్లియర్ చేసుకుని హంతకుడిని ఎలా కనిపెట్టాడనేదే సినిమా కథ.
సినిమా ఎలా ఉందంటే?
సినిమా మొదట్లోనే లైలా హత్యకు గురి కావడం, ఆ కేసు ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళడం, ఆ తర్వాత సీన్ లోకి హీరో రావడం చకచకా జరిగిపోతుంది. కాకపోతే ఈ తరహా సీన్లన్నీ చాలా మామూలుగానే ఉంటాయి. డిటెక్టివ్ పాత్రను పోలీసులే హైప్ చేస్తారు తప్ప, నిజంగా తన తెలివితేటలతో హైప్ తెప్పించే సీన్ ఎక్కడా ఉండదు. అనుమానితులు ఎవరో తెలిసిపోగానే వాళ్ళ చుటూ విచారణ కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ విచారణ పెద్ద ఆసక్తికరంగా అనిపించదు. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అంతగా ఆకట్టుకునే ట్విస్టులు హత్య సినిమాలో కనిపించవు. సెకండాఫ్ మొత్తం విచారణే ఉంటుంది. చివర్లో విలన్ రివీల్ కావడం, అతనికున్న బ్యాక్ స్టోరీ ఆసక్తిగా అనిపిస్తుంది.
ఎవరెలా చేసారంటే?
విజయ్ ఆంటోనీ నటన బాగుంటుంది. సినిమాలో పెద్దగా నటించడానికి ఆస్కారం ఎక్కువగా లేకపోవడం వల్ల ఎప్పుడూ ఒకే రకమైన ఎమోషన్ లో ఉంటాడు. రితికా సింగ్ తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది. ఈ సినిమా మొత్తం ఆమె సీరియస్ లుక్ లోనే కనిపించింది. మీనాక్షి చౌదరి ఫర్వాలేదనిపించింది. కెమెరా వర్క్ బాగుంది. సినిమాను మరింత బాగా చూపించడంలో కెమెరామెన్ సక్సెస్ అయ్యారు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. కథ బాగానే ఉన్నా కథనంలో లోపాలు కనిపించాయి. తెర మీద సీన్లు నెమ్మదిగా పోవడం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. కథలో మలుపులతో స్క్రీన్ ప్లే ను పరుగులు పెట్టిస్తే బాగుండేది.