Page Loader
HBD Keerthy Suresh: నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు .. ఐరన్‌లెగ్‌ ముద్ర నుంచి మహానటి వరకు..
నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు .. ఐరన్‌లెగ్‌ ముద్ర నుంచి మహానటి వరకు..

HBD Keerthy Suresh: నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు .. ఐరన్‌లెగ్‌ ముద్ర నుంచి మహానటి వరకు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అందాన్ని పక్కనపెట్టి అభినయాన్ని ముందు ఉంచి ప్రేక్షకులను కట్టిపడేసే నాయికల్లో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు. సినీ నేపథ్య కుటుంబంలో జన్మించడంతో ఆమె తెరంగేట్రం సులభంగా జరిగినప్పటికీ, తరువాత ఆమె ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఐరన్‌లెగ్‌ ముద్ర నుంచి బయటపడి ఈతరం మహానటి అనిపించుకున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ జర్నీ సంగతులివీ..

వివరాలు 

ఆగిపోయిన సినిమాలు! 

మలయాళ నటులు సురేశ్‌కుమార్‌, మేనకల కుమార్తె కీర్తి సురేశ్‌.. 'పెలట్స్‌'సినిమాతో బాలనటిగా అరంగ్రేట్రం చేశారు. మరో రెండు మాలీవుడ్ సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఆమె మోహన్‌లాల్‌ మూవీ 'గీతాంజలి'తో హీరోయిన్‌గా మారారు. అంతకు ముందు మూడు సినిమాలలో కీర్తి హీరోయిన్‌గా ఖరారుకాగా, చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయాయి. 'గీత','అంజలిగా' తొలి ప్రయత్నంలోనే ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నా,వసూళ్ల పరంగా సినిమా నిరాశపరిచింది. ఆ తర్వాత నటించిన 'రింగ్‌ మాస్టర్‌' ఫర్వాలేదనిపించినా,తన ఫస్ట్‌ తమిళ్‌ ఫిల్మ్‌ 'ఇదు ఎన్న యామమ్‌' మాయ చేయలేకపోయింది. టాలీవుడ్‌లో నటించిన తొలి సినిమా 'రెండు జళ్ల సీత' పేర్లు మారుతూ,విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మూడు పరిశ్రమల్లోనూ ఫలితం దక్కకపోవడంతో కెరీర్‌ ప్రారంభంలో ఆమెపై ఐరన్‌లెగ్‌ ముద్ర పడింది.

వివరాలు 

ముందు భయపడినా.. 

'ఆ ట్రోల్స్‌ని పట్టించుకోకుండా ముందుకెళ్లా. అందుకే ఇవాళ ఇలా ఉండగలిగా' అంటుంటారామె. 'నేను.. శైలజ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో, ఇటు టాలీవుడ్‌లో.. అటు కోలీవుడ్‌లో అవకాశాలు వరించాయి. కమర్షియల్‌ మూవీస్‌ చేసుకుంటూ వెళ్లే సమయంలో ఆమెలోని అసలైన నటిని బయటకు తీసుకొచ్చిన చిత్రం 'మహానటి' (Mahanati). అలనాటి నటి సావిత్రి పాత్ర పోషించడం కీర్తికి రాసిపెట్టింది.సావిత్రి బయోపిక్‌ కోసం ముందుగా వేరే హీరోయిన్లను అనుకున్నా, చివరకు కీర్తికే ఆ ఛాన్స్‌ దక్కింది. పెద్ద ప్రాజెక్టు.. ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోవచ్చని ఎగిరిగంతేలేయలేదు. సావిత్రిగా నటించాలనే ఆలోచనే ఆమెను భయపెట్టింది.

వివరాలు 

నాపై నాకే డౌట్‌

ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రి పాత్రకు తాను న్యాయం చేయలేకపోతే, అప్పటి వరకూ ఉన్న పేరు కూడా పోయే ప్రమాదముందనుకున్నారు. 'మీరు చేయగలరు..!' అంటూ ఆ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రోత్సహించడంతో ధైర్యంగా ముందడుగేశారు. కానీ, ప్రయాణం సాగుతున్న కొద్దీ విమర్శలు పలకరిస్తూనే వచ్చాయి. 'సావిత్రిగా కీర్తి సురేశ్‌ సెట్‌ అవుతుందా? ఆమె నటనానుభవం కూడా తక్కువే' అని చాలామంది పెదవి విరిచారు. దీనిపై ఓ సందర్భంలో ఆమె స్పందిస్తూ.. ''ఈ పాత్ర ఎంపిక చేసుకునే సమయంలో నాపై నాకే డౌట్‌ ఉంది. ఇతరులు సందేహించడంలో తప్పేముంది?'' అంటూ తానెంత పాజిటివ్‌గా ఉంటారో తెలిపారు. ముందుగా భయపడినా,మెల్లగా పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన కసరత్తులు చేశారు.

వివరాలు 

ఈ ఏడాది బాలీవుడ్‌లోకి..

ఆహార్యంలోనే కాకుండా అభినయంలోనూ అచ్చం సావిత్రిని గుర్తు చేశారు. ఆమె జాతీయ అవార్డు పొందారు. సాటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచారు. 'మహానటి' తర్వాత ఆమె నటించిన 'సామి స్క్వేర్‌', 'పందెం కోడి 2' వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ 'పెంగ్విన్‌', 'మిస్‌ ఇండియా', 'గుడ్‌లక్‌ సఖి' చిత్రాలు సందడి చేయలేకపోయాయి. అంతకుముందు సంవత్సరం విడుదలైన 'దసరా', 'మామన్నన్‌'తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే 'సైరన్‌', 'రఘుతాత'తో అలరించిన కీర్తి, 'రివాల్వర్‌ రీటా', 'కన్నివేడి', 'ఉప్పు కప్పురంబు'తో బిజీగా ఉన్నారు. ' 'బేబీ జాన్‌' (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.తన కెరీర్‌లో సావిత్రి(మహానటి),వెన్నెల (దసరా),కళావతి(సర్కారువారి పాట)పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.

వివరాలు 

చిరు సినిమాలు.. స్పెషల్‌ 

చిరంజీవి 'పున్నమినాగు' సినిమాలో హీరోయిన్‌గా మేనక నటించగా, 'భోళా శంకర్‌'లో ఆయనకు చెల్లిగా కీర్తి సురేశ్‌ నటించారు.మరో అగ్ర హీరో రజనీకాంత్‌కు 'పెద్దన్న'లో ఆమె సోదరిగా నటించడం విశేషం. 'బుజ్జి'కి వాయిస్‌.. 'సామి 2'లో సాంగ్‌ గాత్రంతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటారు కీర్తి. 'సామి స్క్వేర్‌'లో పుదు మెట్రో రైల్‌ సాంగ్‌తో ఉర్రూతలూగించిన ఆమె 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)లో కీలకమైన బుజ్జి వాహనానికి వాయిస్‌ అందించారు. 'గాంధారి' ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్‌ ఉందని చాటిచెప్పారు.