Rajendra Prasad: మూడు నెలలు సరిగ్గా అన్నం తినలేదు.. ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : రాజేంద్రప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. తన జీవితంలో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అవకాశాలు లేకపోవడం, చేతిలో డబ్బుల్లేక మూడు నెలల పాటు అన్నం తినకపోవడం తన జీవితంలో గొప్ప కష్టంగా మారిందని ఆయన చెప్పారు. తన నాన్న స్కూల్ టీచర్‌గా చాలా కఠినంగా ఉండేవారని, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే దాన్ని నాన్న అంగీకరించలేదన్నారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తొలి ప్రయాణం మొదలైంది
మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించినా, అవకాశాలు రాలేదన్నారు. నాన్న కోప్పడితే, బాధగా అనిపించి మళ్లీ మద్రాస్ వచ్చానని, ఆ సమయంలో అనేక కష్టాలు పడ్డానని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక నిర్మాత పుండరీకాక్షయ్య మంచి ఆహారం అందించి, ధైర్యం ఇచ్చారన్నారు. ఆ రోజే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణం మొదలైందన్నారు. అలా డబ్బింగ్ చేస్తున్న సమయంలో వంశీ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు అవకాశం దొరికిందన్నారు. ఈ ప్రయాణం ఎన్నో విలువైన పాఠాలను నేర్పిందన్నారు.