Page Loader
Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం!
గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం!

Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
06:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్రసీమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని బేరీజు వేస్తే కనీస కృతజ్ఞత కూడా సినీ ప్రముఖుల్లో కనిపించడం లేదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమ ఎలా ఎదుర్కొన్నదో, అగ్ర నటులను ఎలా అవమానించిందో మరచిపోవద్దని ఆయన సూచించారు.

Details

వైరుధ్యాలను కత్తెరతో తొలగించాలి

చిత్రసీమ అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ముందడుగు వేస్తున్నామని, వ్యక్తులపై కాకుండా రంగంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమా విడుదల సమయంలో మాత్రమే ప్రభుత్వాన్ని ఆశ్రయించడం సరైంది కాదని, పరిశ్రమ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే సంఘటితంగా ముందుకు రావాలని తెలిపారు. ప్రముఖ నిర్మాతలు - దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, వై. సుప్రియ, చినబాబు, సి. అశ్వనీదత్, నవీన్ ఎర్నేని వంటి వారితో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు.

Details

ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలకు తావులేదు

సినిమాటోగ్రఫీ శాఖకు టికెట్ ధరల పెంపుపై వ్యక్తిగతంగా దరఖాస్తులు ఇవ్వడం కొనసాగుతోందని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి వ్యక్తిగత అర్జీలను పరిగణనలోకి తీసుకోమని, సంబంధిత విభాగాలతో మాత్రమే చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. "మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగిన విధంగా స్వీకరిస్తా" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Details

థియేటర్ల పరిస్థితులపై పూర్తి పర్యవేక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల నిర్వహణపై పవన్ కల్యాణ్ పరిశీలన ప్రారంభించారు. ప్రేక్షకులకు తినుబండారాలు, పానీయాల ధరలు అధికంగా ఉండటంతో పాటు, తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం ఫిర్యాదులు అందుకుంటోందని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో మల్టీప్లెక్స్‌ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

Details

సాంకేతికత, నైపుణ్యాల పెంపుపై దృష్టి 

చిత్రసీమ రూపకల్పన నుంచి మార్కెటింగ్ వరకు 24 విభాగాల్లో నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఆధునిక సాంకేతికత వినియోగం, విభాగాల సమన్వయం, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో పరిశ్రమ ముందుకు సాగాలన్నది ఆయన ఆలోచన. సినీ రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టి చక్కదిద్దే ప్రయత్నంలో ఉందని, అందరూ సహకరించాలని ఆయన సూచించారు.