Hrithik Roshan: హృతిక్-సుసానే విడాకులపై షాకింగ్ క్లారిటీ.. రూ.400 కోట్ల భరణం వార్తలకు ఫుల్‌స్టాప్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, వారి విడాకుల అనంతరం సుసానే రూ.400 కోట్ల భరణం కోరినట్లు, అందుకున్నట్లు గతంలో పలు వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ ప్రచారాలపై సుసానే సోదరి ఫరా ఖాన్ స్పందిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఫరా ఖాన్ మాట్లాడుతూ.. హృతిక్, సుసానే పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని తెలిపారు. విడాకుల తర్వాత కూడా ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.
వివరాలు
ఆ వార్తలు అవాస్తవం..
అలాగే, హృతిక్-సుసానే వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికలలో అనేక ఊహాగానాలు, విమర్శలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆ క్లిష్ట పరిస్థితిని ఇద్దరూ ఎంతో హుందాగా, పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుర్కొన్నారని చెప్పారు. సుసానే రూ.400 కోట్ల భరణం తీసుకున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఫరా ఖాన్ ఖండించారు. భరణం కారణంగా ఆమె మరింత సంపన్నురాలయ్యారంటూ వస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు.
వివరాలు
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దంటూ విన్నపం..
అలాంటి తప్పుడు ప్రచారాలను చూడటం తనకు బాధ కలిగిస్తోందని, అవన్నీ అసత్య ప్రచారాలేనని ఆమె స్పష్టం చేశారు. హృతిక్ రోషన్, సుసానే ఖాన్ 2014 డిసెంబర్‌లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు రెహాన్, హ్రిదాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకుల అనంతరం కూడా తాము మంచి స్నేహితులుగానే కొనసాగుతూ, పిల్లల పెంపకం, బాధ్యతలను కలిసి నిర్వహిస్తున్నామని హృతిక్ గతంలో వెల్లడించారు.