Singer Mangli: మైక్రో ఫైనాన్స్ కేసులో నేను బాధితురాలినే.. మంగ్లీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడిపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. మైక్రోఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయగా, మంగ్లీ కూడా అతనిపై కౌంటర్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన మంగ్లీ,బుధవారం మరోసారి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. మైక్రోఫైనాన్స్ అనే పదమే తనకు తెలియదని పేర్కొంది. ఈకేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రామవత్ మధును మా కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో కలిసిన మాట నిజమే. కానీ ఆయన చేసిన పనులకు నేను బాధ్యురాలిని కాదు. మా తమ్ముడు శివకు కూడా ఈ వివాదంతో సంబంధం లేదు.
వివరాలు
నా పేరును వాడడం బాధగా ఉంది
చీటింగ్‌లో నా పేరును వాడుతున్నాడని తెలుసుకుని నేనే స్వయంగా మధుపై ఫిర్యాదు చేశానని తెలిపింది. మైక్రోఫైనాన్స్ వ్యవహారంలో తాను కూడా ఒక బాధితురాలినేనని, డబ్బులు పెట్టి మోసపోయిన వారు ఉంటే వారికి న్యాయం జరగాలని కోరింది. అయితే అకారణంగా తనపై ఆరోపణలు చేసి బురద చల్లడం వల్ల తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. రామావత్ మధుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదని, చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తానని కూడా వెల్లడించింది. ఇక మరోవైపు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ ఇటీవల ఫిర్యాదు చేసింది.
వివరాలు
న్యాయవాది తప్పుడు ప్రచారం చేస్తున్నారు
తన తరఫు న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, న్యాయవాది సుబ్బారావు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ గుర్తింపు పొందాలని చూస్తున్నారు. ఫైనాన్స్ మోసం కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు చేతినిండా పని ఉంది. ప్రజలను మోసం చేసే పని నేను చేయను. బాధితుల తరఫున నేనూ పోరాడుతాను. నాకు డబ్బుపై ఆశ లేదు.. పాటలే నా ప్రపంచం. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. నా మూలాలను ఎప్పుడూ మర్చిపోనని పేర్కొంది. తన తమ్ముడిపై కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నారని, డబ్బు కట్టలతో కనిపిస్తున్న వ్యక్తి తన తమ్ముడు కాదని స్పష్టం చేసింది.