Actor Shivaji: నాకు దగ్గరైన వాళ్లే ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు: శివాజీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు శివాజీ (Sivaji) తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహిళల దుస్తులపై 'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపడంతో శివాజీ క్షమాపణ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసి, తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీనికి స్పందించిన శివాజీ శనివారం కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిసి వివరణ ఇచ్చారు.
Details
గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై స్పందించారా
కమిషన్ సమావేశం అనంతరం శివాజీ మాట్లాడుతూ, తాను ఏం తప్పు చేశానని తనపై ఇంత కోపం వ్యక్తమవుతోందని ప్రశ్నించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లో జాగ్రత్తలు చెప్పరా అని వ్యాఖ్యానించారు. ఎవరు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత ఇష్టమని, అందులో తనకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై ఇలానే స్పందించారా అంటూ ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను సినిమా ప్రమోషన్ కోసమే చేశాడని కొందరు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Details
మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయి
'దండోరా' ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కమిషన్ తనకు నోటీసులు ఇచ్చిందని, తన మాటల వల్ల బాధపడ్డవారి తరఫున కమిషన్ ప్రశ్నలు అడిగిందని, వాటికి తాను సమాధానాలు ఇచ్చానని చెప్పారు. తాను ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో మాట్లాడేటప్పుడు తన నుంచి తప్పులు దొర్లాయని అంగీకరించారు. తనపై కుట్ర జరుగుతోందని, తనతో కలిసి కెరీర్ ప్రారంభించిన కొందరికి తనపై కోపం ఉందని ఆరోపించారు. తన వ్యాఖ్యల అనంతరం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొందరు జూమ్ మీటింగ్‌లు పెట్టుకుని చర్చలు కూడా చేశారని తెలిపారు. తనకు అత్యంత దగ్గరైనవారే ఇలాంటి కుట్ర చేస్తారని తాను ఊహించలేదన్నారు.
Details
ముఖాముఖి చర్చకు సిద్ధం
తాను తప్పు చేశానని భావిస్తే ముఖాముఖి చర్చకు సిద్ధమని శివాజీ చెప్పారు. తాను అనవసరంగా సలహాలు ఇచ్చానని ఒప్పుకున్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో గోప్యంగా ముందుకు సాగుతోందని, ఎవరి హక్కులకు భంగం కలిగినా వాటిని రక్షించే వ్యవస్థలు ఇప్పటికే ఉన్నాయని పేర్కొన్నారు. ఇకపై సలహాలు ఇవ్వడం మానుకోవాలని తనకు అర్థమైందన్నారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, అవసరమైతే మళ్లీ విచారణకు హాజరవుతానని తెలిపారు. కమిషన్‌కు నచ్చని తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని కోరారు. సినిమాల్లో అవకాశాలు రాకపోతే వ్యవసాయం చేసుకుని బతుకుతానని, తాను రైతు కుటుంబానికి చెందినవాడినని శివాజీ స్పష్టం చేశారు.ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని మరోసారి ఆయన తెలిపారు.