Yash: అభిమాని మరణం నన్ను బాధించింది.. కానీ అక్కడికి వెళ్లలేకపోయా: యశ్
ఈ వార్తాకథనం ఏంటి
అభిమానులు తమ అభిమాన హీరోలను దేవుళ్లలా భావిస్తుంటారు. అయితే ఎవరైనా వీరాభిమాని మృతి చెందితే నటులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇస్తుంటారు. అలాంటి సందర్భాల్లో అభిమానుల వద్దకు వెళ్లకపోతే నటులపై విమర్శలు రావడం సాధారణమే. కన్నడ స్టార్ హీరో యశ్ కూడా గతంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతడి అంత్యక్రియలకు తాను ఎందుకు హాజరు కాలేదో తాజాగా యశ్ వివరించారు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్య జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందువ అతడు సూసైడ్ నోట్ రాశాడు.
వివరాలు
అందుకే అంత్యక్రియలకు వెళ్లలేదు
తాను యశ్, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు వీరాభిమానినని.. తన అంత్యక్రియలకు వారిద్దరూ హాజరు కావాలని అందులో పేర్కొన్నాడు.
రామకృష్ణ అంత్యక్రియలకు అప్పట్లో సిద్ధరామయ్య హాజరయ్యారు. అయితే యశ్ మాత్రం అక్కడికి వెళ్లలేదు. దీంతో ఆయనపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన యశ్.. తాను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించారు.
''అభిమాని చనిపోవడం నన్ను కూడా ఎంతో బాధించింది. కానీ 'ఇలా చేస్తే యశ్ నా దగ్గరకు వస్తాడు' అనే ఆలోచన మాత్రం తప్పు.
నేను ఆ అంత్యక్రియలకు వెళ్తే.. భవిష్యత్తులో మరికొందరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే నేను వెళ్లలేదని తెలిపారు.
వివరాలు
'టాక్సిక్'తో బిజీగా యశ్
తన అభిమానులు ఏదైనా సాధించి తనను కలవాలని కోరుకుంటే.. తప్పకుండా వారి కోసం వెళ్లేందుకు ప్రయత్నిస్తానని యశ్ చెప్పారు.
అయితే ఇలాంటి చర్యలను మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని స్పష్టం చేశారు. తన బాధ్యత ఏమిటో అర్థం చేసుకునే ఆ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
ప్రస్తుతం యశ్ 'టాక్సిక్' సినిమాతో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.