NTR: ఆ నీచులను వదిలిపెట్టను.. డీప్‌ఫేక్ వీడియోపై ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
సామాజిక మాధ్యమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన వీడియోలను రూపొందించడంపై అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాట వీడియోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా రూపొందించడంపై ఆయన మండిపడ్డారు. మహిళలను పూజించే దేశంలో వారి గౌరవాన్ని దిగజార్చేలా ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని, వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
వివరాలు
'ఇది అత్యంత అసహ్యకరమైన చర్య'
'ఇది అత్యంత అసహ్యకరమైన చర్య. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే నేల మనది. 'మాతృదేవోభవ' అనే నినాదం మన సంస్కృతిలో భాగమైన చోట.. కొందరు వ్యక్తులు అత్యంత దిగజారి ప్రవర్తిస్తున్నారు.
ఒక మహిళను అవమానించేలా ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి నీచమైన కంటెంట్‌ను (Deepfake Videos) సృష్టించడం సిగ్గుచేటు.
'చుట్టమల్లే' పాట (Chuttamalle Song) మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న నీచులు ఎవరినీ వదిలిపెట్టను'' అని ఎన్టీఆర్ హెచ్చరించారు.
వివరాలు
ఎవరూ ఇలాంటి కంటెంట్ చూడొద్దు
ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ను ఎవరూ చూడొద్దని కూడా ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ''ఈరోజు వేరొక మహిళకు ఇలాంటి అవమానం జరిగింది.
రేపు మీ ఇంట్లో మీ తల్లి, భార్య, కుమార్తెకూ ఇదే పరిస్థితి ఎదురవ్వొచ్చు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
వివరాలు
సెలబ్రిటీలకు నరకంగా మారిన డీప్‌ఫేక్ వీడియోలు
ఏఐ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు సెలబ్రిటీల పాలిట నరకంగా మారాయి. ఇటీవల 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ శాలిని పాండే కూడా ఇలాంటి ఘటనకు బాధితురాలయ్యారు.
ఆమెను అసభ్యకరంగా చూపించేలా వీడియోలను రూపొందించగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై శాలిని పాండే ఆవేదన వ్యక్తం చేశారు.
టెక్నాలజీని ఇలాంటి విధంగా ఉపయోగించడం సరికాదని ఆమె మండిపడ్డారు.
తనకు సంబంధించిన అసభ్యకర వీడియో కనిపిస్తే ఎవరూ దాన్ని షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం చేయొద్దని.. వెంటనే రిపోర్ట్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
గతంలో రష్మిక, కత్రినా కైఫ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.