Romanchakam: 'సందీప్ కోసం ఏదైనా చేస్తా'.. అర్జున్ రెడ్డి రోజుల్ని గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ!
ఈ వార్తాకథనం ఏంటి
భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో, వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రోమాంచకం' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తనకున్న అనుబంధం, 'అర్జున్ రెడ్డి' రోజుల జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని విజయ్ దేవరకొండ అన్నారు. ఇది కేవలం దర్శకుడు-హీరో, స్నేహితులు లేదా సోదరుల మధ్య ఉన్న బంధం కాదని.. అంతకుమించిన అనుబంధమని పేర్కొన్నారు.
వివరాలు
సందీప్ పిలిచాక ఈ ఈవెంట్‌కు రాకపోతే నేను బతికి వేస్ట్
'అర్జున్ రెడ్డి' సమయంలో తామిద్దరం కలిసి ఒక యుద్ధమే చేశామని గుర్తు చేసుకున్నారు.ఆ సమయంలో తమ చేతిలో డబ్బు లేదని, ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ కూడా లేదని విజయ్ తెలిపారు. అప్పటికి 'పెళ్లిచూపులు' కూడా విడుదల కాలేదని గుర్తు చేశారు.
అలాంటి పరిస్థితుల్లో సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ అన్న, ఆయన తండ్రి ప్రభాకర్ అంకుల్ తమ పొలం అమ్మి 'అర్జున్ రెడ్డి' సినిమా తీశారని చెప్పారు.
అంతటి రిస్క్ తీసుకున్న సందీప్ కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని, అలాగే సందీప్ కూడా తన కోసం ఎక్కడికైనా వస్తారని విజయ్ అన్నారు.
"సందీప్ పిలిచాక ఈ ఈవెంట్‌కు రాకపోతే నేను బతికి వేస్ట్" అంటూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.
వివరాలు
సుమంత్ కి సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి
ఇక రౌడీవేర్ ఆఫీస్ దగ్గర సుమంత్ ప్రభాస్‌ను తాను చూసేవాడినని విజయ్ తెలిపారు. అతని కళ్లలో సినిమా పట్ల ఉన్న తపన, డ్రీమ్ అప్పుడే కనిపించేవని చెప్పారు.
ఒకరోజు సుమంత్ నటుడో, దర్శకుడో అవుతాడని అప్పుడే అనుకున్నట్లు వెల్లడించారు. భద్రకాళి పిక్చర్స్ లోగో కనిపించిన ప్రతిసారీ ఇప్పటికీ 'అర్జున్ రెడ్డి' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తనకు గుర్తొస్తుందని విజయ్ చెప్పారు.
ఆ బ్యానర్‌ను తన సొంత బ్యానర్‌లా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సందీప్, ప్రణయ్ కలిసి సినిమా తీస్తున్నారంటే అది తప్పకుండా హిట్ కావాలని ఆకాంక్షించారు.
అలాగే దర్శకుడు వేణు, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, సుమంత్ ప్రభాస్, అనంతకిలకు కూడా 'రోమాంచకం'తో పెద్ద సక్సెస్ రావాలని విజయ్ దేవరకొండ ఆకాంక్షించారు.
వివరాలు
సెప్టెంబర్ 3న 'రోమాంచకం' రిలీజ్
ఈ సందర్భంగా యువతకు విజయ్ దేవరకొండ కీలక సందేశం ఇచ్చారు. "మన హార్ట్‌లో ఫైర్ ఉండి, యాంబిషన్ ఉండి, నీపై నీకు నమ్మకం ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కొట్టొచ్చు. బాయ్స్.. మీ అందరికీ చెబుతున్నాను.
వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ, మనలోని ఫైర్‌ను కొనసాగించగలిగితే ప్రపంచంలో ఏదీ మనల్ని ఆపలేదని అన్నారు. అంతేకాదు.. 'రోమాంచకం' అంటే ఏమిటి? అని అడిగితే, 1989లో తాను పుట్టినప్పటి నుంచి తన జీవితమే రోమాంచకమని విజయ్ తెలిపారు.
చేతిలో పైసలు ఉన్నా లేకపోయినా, ప్రేమలో పడినా, హార్ట్‌బ్రేక్ అయినా.. జీవితంలోని ప్రతి క్షణం ఒక రోమాంచకమేనని చెప్పారు. కాగా 'రోమాంచకం' సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.