Prashant Tamang: 43 ఏళ్లకే ఇండియన్ ఐడల్ విజేత అకాల మరణం
ఈ వార్తాకథనం ఏంటి
సంగీత రంగాన్ని తీవ్ర విషాదం కమ్మేసింది. ప్రముఖ గాయకుడు ఇండియన్ ఐడల్ సీజన్-3 విజేత ప్రశాంత్ తమాంగ్ (Prashant Tamang) ఇక లేరు. ఆదివారం (జనవరి 11) ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. కేవలం 43 ఏళ్ల వయసులో కెరీర్ పరంగా పూర్తి బిజీలో ఉన్న సమయంలో ప్రశాంత్ అకాల మరణం అభిమానులు, సంగీతప్రియులను శోకసంద్రంలో ముంచింది. ఈ విషాద వార్తను ఆయన సన్నిహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు రాజేష్ ఘటానీ ధృవీకరించారు.
Details
షో ముగించుకుని వచ్చిన కాసేపటికే…
లభ్యమైన సమాచారం ప్రకారం, ప్రశాంత్ తమాంగ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక లైవ్ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక దిల్లీకి తిరిగివచ్చారు. ఆదివారం ఉదయం తన నివాసంలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ద్వారకాలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో ప్రశాంత్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఇది పూర్తిగా ఆకస్మికంగా జరిగిన ఘటన అని సన్నిహితులు పేర్కొన్నారు.
Details
పోలీస్ కానిస్టేబుల్ నుంచి పాప్ స్టార్ వరకూ…
1983 జనవరి 4న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించిన ప్రశాంత్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తండ్రి మరణం అనంతరం కుటుంబ భాద్యతల కోసం కోల్‌కతా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా చేరారు. అక్కడ పోలీస్ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ తన గాత్రాన్ని మెరుగుపరుచుకున్నారు. 2007లో ఇండియన్ ఐడల్ సీజన్-3లో పాల్గొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తన గానం ద్వారా కోట్లాది మందిని ఆకట్టుకుని, ఏకంగా 7 కోట్ల ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. అనంతరం 'ధన్యవాద్' ఆల్బమ్‌తో పాటు 'మన్ సైన్లీ', 'గోర్ఖా పల్టన్' వంటి పాటలతో విశేష గుర్తింపు పొందారు.
Details
నటనలోనూ తనదైన ముద్ర
గాయకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా కూడా ప్రశాంత్ తమ ప్రతిభను చాటుకున్నారు. పలు నేపాలీ చిత్రాల్లో నటించిన ఆయన, అమెజాన్ ప్రైమ్ హిట్ వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్ 2'లో డేనియల్ అచో అనే కీలక పాత్రలో కనిపించారు. అంతేకాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'బాటిల్ ఆఫ్ గల్వాన్' సినిమాలో కూడా ప్రశాంత్ నటిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ఆయన మరణవార్త రావడం మరింత విషాదకరం. ప్రశాంత్ తమాంగ్ అకాల మరణం సంగీత, వినోద రంగాలకు తీరని లోటు. ఆయన గానం, జీవన ప్రయాణం ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతాయి.