LOADING...
Cheekatilo Review : 'చీకటిలో' రివ్యూ.. మర్డర్ మిస్టరీ ఎంతవరకు ఎంగేజ్ చేసిందంటే?
'చీకటిలో' రివ్యూ.. మర్డర్ మిస్టరీ ఎంతవరకు ఎంగేజ్ చేసిందంటే?

Cheekatilo Review : 'చీకటిలో' రివ్యూ.. మర్డర్ మిస్టరీ ఎంతవరకు ఎంగేజ్ చేసిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'చీకటిలో'. విశ్వదేవ్‌ రాచకొండ, శ్రీనివాస్‌ వడ్లమాని, అదితి మ్యాకల్‌, ఆమని, చైతన్య కృష్ణ, ఈషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా, సంగీతాన్ని శ్రీచరణ్‌ పాకాల అందించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో జనవరి 23 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంతో రూపొందిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

Details

కథ

సంధ్య నెల్లూరి (శోభితా ధూళిపాళ) ఓ న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌. నేరాలు, ఘోరాలు ఆధారంగా ప్రసారం చేసే ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే టీఆర్పీ కోసం ఛానల్‌ అనుసరించే విధానాలు ఆమెకు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. అదే సమయంలో రెండేళ్లుగా ఆ ఛానల్‌లో ఇంటర్న్‌గా పనిచేస్తున్న బాబీ (అదితి మ్యాకల్‌) ఇచ్చిన ఐడియాతో పాడ్‌కాస్ట్‌ ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అనూహ్యంగా బాబీ హత్యకు గురవుతుంది. ఈ హత్య వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో సంధ్యకు ఇది సీరియల్‌ కిల్లర్‌ పని అని అర్థమవుతుంది. తాను సేకరించిన వివరాలను పాడ్‌కాస్ట్‌ రూపంలో బయటకు తీసుకురావడంతో ఈ వ్యవహారం ప్రజల్లోనే కాదు, పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారుతుంది.

Details

విశ్లేషణ

సీరియల్‌ కిల్లర్‌ నేపథ్యంతో మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలు కొత్తేమీ కాదు. చాలా చిత్రాల్లో హంతకుడు వరుస హత్యలు చేయడానికి గల కారణాలు రొటీన్‌గా అనిపిస్తుంటాయి. అయితే 'చీకటిలో'లో మాత్రం సీరియల్‌ కిల్లర్‌ మోటివ్‌ను కొంచెం భిన్నంగా ఆవిష్కరించారు. ఇప్పటివరకు లైంగిక వేధింపులను ఒకే కోణంలో చూపిస్తే, ఈ సినిమాలో మరో కోణాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అదే సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. కథా పాయింట్‌ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, సినిమా ఆరంభం మాత్రం చాలా రొటీన్‌గా సాగుతుంది. శోభితా పాత్ర పరిచయం, వరుస హత్యల స్థాపన ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెద్దగా రేకెత్తించలేకపోతాయి.

Advertisement

Details

ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అద్భుతం

ఇన్వెస్టిగేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభ దశలో ఆసక్తిని కలిగించదు. అయితే మొదటి గంట గడిచిన తర్వాతే కథలో నిజమైన ఉత్కంఠ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి అరగంట మాత్రం ప్రేక్షకులను బలంగా ఎంగేజ్‌ చేస్తుంది. ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్లలో సాధారణంగా కొన్ని పాత్రలపై అనుమానాలు కలిగించే జిమ్మిక్కులు ఉంటాయి. 'చీకటిలో'లో కూడా దర్శక-రచయితలు ఆ పద్ధతిని అనుసరించారు. అయితే ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్‌ మాత్రం ఊహలకు అందకుండా ఉండి సినిమాకు బలం చేకూర్చింది. చివరి వరకు హంతకుడు ఎవరో ఊహించడం కష్టంగా ఉంటుంది. మహిళలపై లైంగిక దాడులు, హత్యల వంటి సున్నిత అంశాలు ఉన్నప్పటికీ, దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి వాటిని వల్గర్‌గా చూపించకుండా జాగ్రత్త పడ్డారు.

Advertisement

Details

శోభితా నటన అద్భుతం

సాంకేతికంగా కూడా సినిమా బలంగా నిలుస్తుంది. శ్రీచరణ్‌ పాకాల అందించిన నేపథ్య సంగీతం, పాటలు కథతో పాటు ప్రయాణిస్తూ సన్నివేశాల తీవ్రతను పెంచాయి. సినిమాటోగ్రఫీ కథకు తగినట్టుగా డార్క్‌ టోన్‌ను నిలబెట్టింది. ముఖ్యంగా మీడియాలో పనిచేసే మహిళలంటే తప్పనిసరిగా వెస్ట్రన్‌ వేర్‌లోనే చూపించాలన్న రొటీన్‌ ఆలోచనకు భిన్నంగా, చుడిదార్‌, చీరల్లో కనిపించే మహిళలు కూడా స్ట్రాంగ్‌, ఇండిపెండెంట్‌ అనే భావనను ఈ సినిమా బలంగా చెప్పింది. సినిమా అంతటా శోభితా ధూళిపాళ చుడిదార్‌, చీరల్లో కనిపించడం సినిమాకు తెలుగు నేటివ్‌ ఫీల్‌ను తీసుకొచ్చింది.

Details

నటన

'చీకటిలో'కు ప్రధాన బలం శోభితా ధూళిపాళ నటన. ముఖ్యంగా ఆమె చేసిన డబ్బింగ్‌ సినిమాకు అదనపు బలం చేకూర్చింది. 'గూఢచారి', 'మేజర్' వంటి సినిమాల్లో కనిపించినప్పటికీ, తెలుగులో కథానాయికగా ఆమె నటించిన తొలి సినిమా ఇదేనని చెప్పాలి. పాత్రకు తగ్గట్టుగా సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం ఆమె నటనలో స్పష్టంగా కనిపిస్తాయి. శోభిత వాయిస్‌, లుక్‌ అచ్చ తెలుగమ్మాయి ఫీల్‌ను ఇచ్చాయి. విశ్వదేవ్‌ రాచకొండ, ఈషా చావ్లా, ఆమని, సురేష్‌ పాత్రలు పరిమిత పరిధిలోనే ఉన్నాయి. రవీంద్ర విజయ్‌ పాత్రను మరింత బాగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, అది పూర్తిగా వినియోగించలేదు. అయితే శ్రీనివాస్‌ వడ్లమాని నటన మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది.

Details

తుది మాట

క్రైమ్‌ థ్రిల్లర్స్‌, మర్డర్‌ మిస్టరీలను ఇష్టపడే ప్రేక్షకులకు 'చీకటిలో' ఒక డిఫరెంట్‌ అనుభూతిని ఇస్తుంది. ప్రారంభంలో కొంచెం రొటీన్‌గా అనిపించినా, సినిమా ముందుకు సాగేకొద్దీ ఆసక్తిని పెంచుతుంది. చివరి అరగంట బలంగా ఆకట్టుకుంటుంది. శోభితా-అక్కినేని ఫ్యాన్స్‌ అంచనాలు కొంచెం తగ్గించుకోవడం మంచిది. హిందీలో వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న శోభితా ధూళిపాళకు, తెలుగు ఓటీటీలో 'చీకటిలో' ఒక మంచి ఆరంభంగా చెప్పొచ్చు.

Advertisement