రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా?
నటీనటులు: రజనీకాంత్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, తమన్నా, సునీల్ తదితరులు దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ కథ: జైలర్ గా రిటైరైన ముత్తు వేల్ పాండియన్ (రజనీకాంత్), కొడుకు, మనవడితో సరదాగా గడుపుతుంటాడు. ఒకానొక టైమ్ లో కొడుకు హత్యకు గురైన వార్త బయటకు వస్తుంది? దాంతో హత్య చేసిన వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకోవాలని ముత్తు అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కొడుకు గురించి ముత్తుకు తెలియని విషయాలేంటి? అన్నదే కథ.
సినిమా ఎలా ఉందంటే?
జైలర్ ప్రథమార్థం మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. రజనీకాంత్ స్టయిల్ తో కూడిన సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. పాత రజనీకాంత్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ముత్తు కొడుకు హత్యకు గురైయ్యాడన్న వార్త తర్వాత సినిమాలో వేగం పెరుగుతుంది. అప్పటి నుండి ముత్తు పాత్రలో చాలా మార్పు వస్తుంది. తెరమీద సీన్లు చకచకా వెళ్ళిపోతుంటాయి. ఇంటర్వెల్ సీన్ లో మాంచి ఊపు వస్తుంది. సెకండాఫ్ తర్వాత వచ్చే యాక్షన్ సీన్ ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆ సీన్ తర్వాత జైలర్ కథ గాడి తప్పినట్టు అనిపిస్తుంటుంది. ఎక్కడి నుండి ఎటెటో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ప్రథమార్థాన్ని చక్కగా డీల్ చేసిన దర్శకుడు సెకండాఫ్ లో తడబడ్డాడు.
ఎవరెలా చేసారంటే?
రజనీకాంత్ తనదైన శైలిలో అభిమానులను ఉర్రూతలూగించాడు. రమ్యకృష్ణ గృహిణి పాత్రలోనే ఉండిపోతుంది. ఆమె పాత్రలో పెద్దగా మార్పులు కనిపించవు. సెకండాఫ్ లో వచ్చే పాటలో తమన్నా కనిపిస్తుంది. సునీల్ తో కామెడీ చేయించాలని చూసారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ తమ పాత్రలకు తగ్గట్టుగా కనిపించారు. యోగిబాబు ఫర్వాలేదు. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ అని చెప్పవచ్చు. సినిమాలో పాటల్లేవన్న ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. రచయిత, దర్శకుడు నెల్సన్, ఫస్టాఫ్ ని నడిపినంత వేగంగా సెకండాఫ్ ని నడిపితే సినిమా మరింత ఆసక్తిగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి జైలర్ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.