Jananayagan Leak: విడుదలకు ముందే లీక్ అయిన 'జననాయగన్'.. ఆరుగురు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ అగ్రకథానాయకుడు విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' విడుదలకు ముందే పైరసీ సమస్యను ఎదుర్కొంటోంది. సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై చిత్రబృందం తరఫు న్యాయవాది అధికారిక ప్రకటన విడుదల చేశారు. సినిమా లీక్‌కు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. లీక్ అయిన సన్నివేశాలను ఎలాంటి రూపంలోనైనా డౌన్‌లోడ్ చేయడం, పంచుకోవడం చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివరాలు
విజయ్‌కు మద్దతుగా అగ్రతారలు
పైరసీకి సంబంధించిన సమాచారాన్ని పంపిన వారిని కూడా గుర్తించి వెంటనే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కేసులో భాగంగా పోలీసులు కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సెన్సార్ ధృవీకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. ఈ సమయంలో సినిమా లీక్ కావడం చిత్రబృందంతో పాటు పరిశ్రమ మొత్తంలో ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్రతారలు విజయ్‌కు మద్దతుగా నిలిచారు.