LOADING...
Jana nayagan: 'జన నాయగన్‌'కు మళ్లీ ఎదురుదెబ్బ.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు రద్దు
'జన నాయగన్‌'కు మళ్లీ ఎదురుదెబ్బ.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు రద్దు

Jana nayagan: 'జన నాయగన్‌'కు మళ్లీ ఎదురుదెబ్బ.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ (Vijay) కథానాయకుడిగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జన నాయగన్‌' (Jana Nayagan) సినిమాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని గతంలో మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్‌ బెంచ్‌ను ఆదేశించింది. సెన్సార్‌ బోర్డుకు తన వాదనలు వినిపించుకునే న్యాయపరమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ సినిమాను రివైజింగ్‌ కమిటీకి పంపిన సీబీఎఫ్‌సీ నిర్ణయం సరైనదా కాదా అన్న అంశాన్ని సింగిల్‌ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.

Details

ఇంకా అలస్యమయ్యే అవకాశం

ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మరోసారి సమగ్ర విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసే అధికారం సింగిల్‌ బెంచ్‌కే ఉందని డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. దీంతో 'జన నాయగన్‌' విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జనవరి 9న సెన్సార్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC) మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

Details

సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే

కేసును విచారణకు స్వీకరించిన డివిజన్‌ బెంచ్‌.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టేను సవాల్‌ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను సంప్రదించాలని నిర్మాతలకు సూచించింది. జనవరి 21న ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు వినిపించిన అనంతరం డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఆ తీర్పును వెల్లడిస్తూ.. మరోసారి విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్‌ బెంచ్‌కు కేసును తిరిగి పంపింది.

Advertisement