Loading...
Janasena Party: జనసేన నాయకులు, వీర మహిళలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
జనసేన నాయకులు, వీర మహిళలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

Janasena Party: జనసేన నాయకులు, వీర మహిళలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ శ్రేణులు ఎక్కడైనా స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు ఉండవని తేల్చిచెప్పారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో మాదిరిగా సీట్ల సర్దుబాట్లు, స్థానాల పంపకాలు ఉండవని వెల్లడించారు. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు

పంచాయతీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు ఉండవు

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది.

కొన్ని స్థానాల్లో సీట్ల పంపకం క్లిష్టంగా మారింది. కూటమి పార్టీలకు పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో స్థానాల కేటాయింపు సవాల్‌గా మారింది.

కొన్నిచోట్ల తమకు అన్యాయం జరిగిందంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ స్వేచ్ఛ కల్పించారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరుగుతాయని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి బరిలోకి దిగే హక్కు ఉంటుందని తెలిపారు.

వివరాలు

 ఎవరూ అడ్డుకోకూడదు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని స్పష్టం చేశారు.

పోటీ చేయాలనుకునే పార్టీ శ్రేణులను జనసేన నాయకులు ఎవరూ అడ్డుకోవద్దని ఆదేశించారు.

మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవని వెల్లడించారు.

జనసేన తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు

మరోవైపు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది.

ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని జనసేన కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

ఎన్నికల బరిలో ఉన్నవారికి ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించింది.

ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారు.

ADVERTISEMENT