Jaya Bachchan: 'పెద్ది' వివాదంపై జయా బచ్చన్ ఫైర్.. ఇలాంటి వాటిని సెట్‌లోనే అడ్డుకోవాలన్నారు!
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' చిత్రం విడుదలైన తర్వాత అందులో హీరోయిన్ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కథానాయిక పాత్రను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారనే విమర్శలు రావడంతో ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి జయా బచ్చన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో మహిళలను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి విషయాలపై షూటింగ్ సమయంలోనే అభ్యంతరం వ్యక్తం చేయాలని, అంతా పూర్తయిన తర్వాత మాట్లాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. సెట్‌లోనే నటీమణులు తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాలని సూచించారు.
వివరాలు
చేదు అనుభువాన్ని గుర్తు చేసుకున్న జయా బచ్చన్
ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని జయా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. గతంలో 'షోర్' సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను ఒక ప్రత్యేక సన్నివేశం కోసం గాగ్రా చోళీ తరహా దుస్తులు ధరించాలని కోరినట్లు చెప్పారు. అయితే ఆ దుస్తులకు తప్పనిసరిగా చున్నీ ఉండాలని తాను పట్టుబట్టడంతో దర్శకుడితో పెద్ద వాగ్వాదం జరిగిందని వెల్లడించారు. "ఆ ఘటన తర్వాత సెట్‌లో ఎవరూ నాతో హద్దులు దాటే ప్రయత్నం చేయలేదు. నా కెరీర్‌లో నన్ను ఆ విధంగా చూపించాలని ప్రయత్నించిన చేదు అనుభవం అదొక్కటే. ఆ తర్వాత ఆ దర్శకుడితో నేను మళ్లీ ఎప్పుడూ పని చేయలేదు" అని జయా బచ్చన్ స్పష్టం చేశారు.
వివరాలు
బాలీవుడ్ నటి కరీనా కపూర్ మద్దతు
ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నటీమణులు వెంటనే స్పందించి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆమె సూచించారు. జయా బచ్చన్ వ్యాఖ్యలకు బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా మద్దతు తెలిపారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం లేదా తెరపై రొమాన్స్‌ను చూపించడం కోసం ప్రత్యేకంగా అలాంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. కాజోల్, శ్రీదేవి, షర్మిలా ఠాగూర్ వంటి ప్రముఖ నటీమణులు పూర్తిస్థాయి దుస్తులతోనే అద్భుతమైన నటన, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని కరీనా గుర్తు చేశారు.
వివరాలు
దుస్తుల కంటే ప్రతిభే ముఖ్యం
నటనకు, పాత్ర ప్రభావానికి దుస్తుల కంటే ప్రతిభే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. కాగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో నటించారు. అయితే ఆమె పాత్రను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారనే విమర్శలు ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా వ్యక్తమయ్యాయి. తెరపై ఆమె పాత్రను చూపించిన విధానంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.