LCU: లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి జయం రవి ఎంట్రీ.. అధికారిక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
'లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్' (ఎల్‌సీయూ)లో భాగంగా రూపొందుతున్న కొత్త చిత్రం 'బెంజ్'పై మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో నటుడు రవి మోహన్ (జయం రవి) కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 'బెంజ్'. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రవి మోహన్ ఏ పాత్రలో కనిపించబోతున్నారన్న విషయంపై చిత్రబృందం ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
వివరాలు
మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు
ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాలోని పాత్రలతో అనుసంధానం చేస్తూ సినిమాటిక్ యూనివర్స్‌కు కొత్త రూపం ఇచ్చిన దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కార్తి నటించిన 'ఖైదీ', కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'విక్రమ్', విజయ్ నటించిన 'లియో' చిత్రాలు ఈ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కాయి. అదే తరహాలో 'బెంజ్' చిత్రం కూడా లోకేశ్ కనగరాజ్ రచించిన కథ ఆధారంగా రూపొందుతుండటం విశేషం.
వివరాలు
అల్లు అర్జున్ తో మూవీ
గతేడాది విడుదలైన 'కూలీ' తర్వాత లోకేశ్ తదుపరి దర్శకత్వ చిత్రం 'ఖైదీ 2' అవుతుందని అభిమానులు భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఆయన అల్లు అర్జున్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు, దర్శకుడిగా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తున్న లోకేశ్ కనగరాజ్ 'డీసీ' చిత్రంతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.