కాలాపాని ట్రైలర్: అండమాన్ జైలు కథాంశంతో ఆసక్తిని పెంచుతున్న కొత్త సిరీస్
అండమాన్ జైలు అనగానే అందరికీ గుర్తొచ్చేది చిరంజీవి నటించిన వేట సినిమా మాత్రమే. ఆ సినిమాలో అండమాన్ జైలులో చిరంజీవి అనుభవించే కష్టాలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ప్రస్తుతం అండమాన్ జైలు కథాంశంతో సరికొత్త సిరీస్ వస్తోంది. కాలాపాని అనే టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. అండమాన్ దీవుల్లో ఈ కథ జరగబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సముద్రం, అడవులు, ఆటవికుల మధ్య జరిగే కథలాగా కాలాపని సిరీస్ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాలాపాని ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
అక్టోబర్ 18 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న కాలాపాని
కాలాపాని సిరీస్ లో ఆశుతోష్ గోవారికర్, మోనా సింగ్, సుకాంత్ గోయల్, ఆరుషి శర్మ, వికాస్ కుమార్ అమీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమీర్ సక్సేనా నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 18 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అదలా ఉంచితే గతంలో మోహన్ లాల్, ప్రభు హీరోలుగా కాలాపాని అనే సినిమా వచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.