Kalki 2: 'కల్కి 2'లో కురుక్షేత్ర యుద్ధం..20 నిమిషాలు గూస్‌బంప్స్!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ వద్ద విశేష విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ముగింపులో రెండో భాగంపై ఇచ్చిన సంకేతాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ముఖ్యంగా మహాభారతానికి సంబంధించిన ప్రారంభం, ముగింపు సన్నివేశాలు థియేటర్లలో విపరీతమైన స్పందనను పొందాయి. అయితే ఆ భాగాలు తక్కువ సమయం మాత్రమే ఉండటంతో, ఇంకా ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడేమో 'కల్కి 2'లో మహాభారతానికి సంబంధించిన ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. దాదాపు 20 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ కొనసాగుతుందని తెలుస్తోంది.
వివరాలు
బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయం..
మొదటి భాగంలో కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించిన కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలు, ఇప్పుడు ఎక్కువ సమయం పాటు చూపించబడితే సినిమా స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అశ్వత్థామకు సంబంధించిన శాపం, కర్ణుడి పరాక్రమం, శ్రీకృష్ణుడి వ్యూహాలు వంటి అంశాలు ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పురాణ కథనాలను సైన్స్ ఫిక్షన్‌తో మేళవించిన విధానం భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త దిశగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో ఈ 20 నిమిషాల భాగం ప్రేక్షకులకు థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
విజువల్ వండర్..
దర్శకుడు నాగ్ అశ్విన్ తన విజువల్ ప్రతిభతో తెలుగు సినిమాను మాత్రమే కాకుండా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి భాగం కథకు పరిచయం మాత్రమే కాగా, రెండో భాగంలో అసలు కథనాన్ని, యుద్ధాన్ని విస్తృతంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతుండగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లతో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రభాస్ కూడా షూటింగ్‌లో చేరనున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా సాగితే, వచ్చే ఏడాది 'కల్కి 2' విడుదలకు సిద్ధమవుతోంది.