Sing Geetham: 45 ఏళ్లుగా మనసులో ఉన్న కథ.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు: కమల్ హాసన్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో కొత్తదనానికి, వినూత్న ప్రయోగాలకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన తాజా చిత్రం 'సింగ్ గీతం'. 94 ఏళ్ల వయసులోనూ ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా జూన్ 11న విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం చెన్నైలో ప్రీ-రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు కమల్ హాసన్, సింగీతంతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
వివరాలు
కమల్ హాసన్ ఏం చెప్పాడంటే...
కమల్ హాసన్ మాట్లాడుతూ, ''సింగీతం శ్రీనివాసరావుకు సినిమాపై ఉన్న మక్కువ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఆయనలోని ఆ తపన, అంకితభావం యథాతథంగానే ఉన్నాయి. నేను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయనతో నా సినీ ప్రయాణం ప్రారంభమైంది. మా మొదటి చిత్రం ఎంతో సహజంగా రూపొందింది. ఆ తర్వాత ఆయన నాకు రెండు కథలు వినిపించారు. అందులో ఒకటి 'పుష్పక విమానం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో కథ గురించి దాదాపు 45 ఏళ్లుగా చర్చించుకుంటూనే ఉన్నాం. కానీ వివిధ కారణాల వల్ల అది రూపుదాల్చలేదు. ఇప్పుడు అదే కథ 'సింగ్ గీతం' రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
వివరాలు
ఆయన ఆలోచనలు డిఫరెంట్..
సింగీతం గారి ఆలోచనలు నేటి జెన్-జీ తరం కన్నా కూడా ముందుంటాయి. ఆయన నుంచి నేను ఇప్పటికీ ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. అవకాశం వస్తే ఆయన వద్ద సహాయ దర్శకుడిగా కూడా పని చేయాలని ఉంది. ఒక సినిమాలో పెద్ద పెద్ద తారలు నటించడం వల్ల మాత్రమే అది గొప్ప సినిమా అవదు. అసలైన గొప్పదనం కథలో, ఆలోచనలో ఉంటుంది. ఏ సినిమా విజయాన్ని సాధిస్తుంది? ఏది ఆశించిన ఫలితాన్ని అందుకోదు? అనే విషయాన్ని ముందుగానే ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు'' అని కమల్ హాసన్ పేర్కొన్నారు.