Happy Birthday Keeravani: ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి స్వర సంచలనాలు ఇవే
'నాటు నాటు పాట'తో ఆస్కార్ సాధించి, తెలుగు సినిమా సంగీతాన్ని ప్రపంచ నలువీధుల్లో మారుమోగించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. తెలుగులో అక్షరానికి, స్వరానికి సమ ప్రధాన్యత ఇచ్చే ఏకైక స్వరకర్త. తెలుగులో ఎం.ఎం.కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం.ఎం.క్రీమ్ గా భారతీయ సీని చరిత్రలో మూడు పేర్లతో మ్యూజిక్ చేస్తున్న ఒకే ఒక్క సంగీత దర్శకుడు. 1989లో మనసు-మమత సినిమాతో తెలుగుతెరకు సంగీత దర్శకుడిగా పరిచయమైన కీరవాణి, ఆ తర్వాత తన బాణీలతో సంగీతప్రియులను ఓలలాడిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి ఎప్పుడైతే జతకలిశాడో కీరవాణి భారతీయ సంగీత ప్రపంచంలోనే కాకుండా, విశ్వ యవనికపై తారాజువ్వలా దూసుకుపోయారు. కీరవాణి మంగళవారం(జులై 4)పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన కెరీర్లో వచ్చిన అత్యుత్తమ ఆల్బమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్షణ క్షణంతో తెలుగులో బ్రేక్
1991లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం- కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ హిట్ క్షణ క్షణం. ఈ సినిమాతో కీరవాణి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోయారు. ఈ సినిమాలో ఐదు పాటలు ఉండగా అన్నీ టాప్ నాచ్ బీట్స్ కావడం గమనార్హం. విమర్శకులు, శ్రోతలు దీనిని అద్భుతమైన ఆల్బమ్‌గా పేర్కొన్నారంటే అతిశయోక్తి కాదు. 'క్షణ క్షణం' ఇప్పటికీ చాలామందికి ఇష్టమైన వాటిలో ఒకటిగా మిగిలిపోయింది. ఉత్తమ సంగీత దర్శకునిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ను ఎం.ఎం.కీరవాణి అందుకున్నారు. కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత తన 'క్షణ క్షణం' మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన మొదటి ఆస్కార్ క్షణం క్షణం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన అన్నమయ్య
అన్నమయ్య 15వ శతాబ్దపు స్వరకర్త అన్నమాచార్య నేపథ్యాన్ని తీసుకొని తీసిన భక్తిరస చిత్రం అన్నమమయ్య. ఈ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో 20 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఈ సినిమాకి కీరవాణి అందించిన సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. క్రిమినల్ అక్కినేని నాగార్జున నటించిన, కీరవాణి సంగీత సారధ్యంలో వచ్చిన 'క్రిమినల్' చిత్రంలో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. 'తెలుసా మనసా' పాట ఇప్పటికీ చాలా మంది హమ్ చేస్తుంటారు. ఇది తెలుగులో ఎవర్‌గ్రీన్ పాటలలో ఒకటిగా మిగిలిపోయింది.
పెళ్లి సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే
పెళ్లి సందడి కె.రాఘవేంద్రరావు- కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మరో మ్యూజికల్ హిట్ పెళ్లి సందడి. ఈ మూవీలోని పాటల గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలోని తొమ్మిది పాటలూ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలో సంగీతానికి గాను కీరవాణికి పలు అవార్డులు వచ్చాయి. మగధీర దర్శకధీరుడు రాజమౌళి 'మగధీర' సూపర్ హిట్ మూవీ మగధీర. ఎంఎం కీరవాణి ఈ సినిమాలో ఆరు పాటలను అందించారు. అన్ని సాంగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతులే. చంద్రబోస్ రచించిన 'పంచదార బొమ్మ' పాట ఎంత ప్రజాధారణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆస్కార్ తెచ్చి పెట్టిన నాటు నాటు పాట
బాహుబలి రాజమౌళి- కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ హిట్ బాహుబలి పార్ట్-1, పార్ట్-2. ఈ రెండు సినిమాల్లో కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అబ్బురపరిచింది. సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కీరవాణికి ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఆర్ఆర్ఆర్ రాజమౌళి-కీరవాణి సృష్టించిన సంగీత ప్రభంజనం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఏడు పాటలు ఉండగా, అన్ని ఆణిముత్యాలే. ఈ సినిమాలో 'నాటు నాటు' పాట ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ అవార్డులు కాదు, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అత్యంత ప్రతిష్ఠాత్మంగా భావించే ఆస్కార్ అవార్డును ఈ పాట సొంత చేసుకొని కీరవాణి సత్తాను చాటింది.