Keerthy Suresh: తిరుమలలో కీర్తి సురేష్ సందడి.. వచ్చే నెలలో గోవాలో పెళ్లి
కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ప్రస్తుతం బాగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె కాబోయే జీవిత భాగస్వామి గురించి ఇంకా అధికారికంగా చాలా వివరాలు బయటకు రాలేదు. అయినప్పటికీ, ఆంటోని తట్టిల్‌తో కీర్తి సురేష్ 15 ఏళ్లుగా సంబంధంలో ఉందన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకు మీడియా పసిగట్టలేకపోయింది. తన పెళ్లి గురించి కీర్తి సురేష్ తాజాగా పరోక్షంగా స్పందించగా, ఇప్పుడు మాత్రం నేరుగా వెల్లడించింది. శుక్రవారం తిరుమల దర్శనానికి వచ్చిన కీర్తి, తన కొత్త చిత్రం బేబీ జాన్ ప్రమోషన్‌తో పాటు వచ్చే నెలలో జరగబోయే తన పెళ్లి కారణంగా దర్శనానికి వచ్చానని చెప్పింది. పెళ్లి స్థలం గురించి అడిగితే, గోవాలో జరుగుతుందని సాదాసీదా సమాధానం ఇచ్చింది.
బాలీవుడ్ చిత్రాలతో బిజీ
కీర్తి ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. సౌత్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగులో, ఆమె ఆఫర్లు తగ్గినట్టు కనిపిస్తోంది. గతంలో వరుస చిత్రాలతో దూసుకెళ్లిన కీర్తి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కొంత నష్టపోయినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో వచ్చిన పెంగ్విన్,మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి. వాటి ప్రభావంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే, నాని దసరా చిత్రంతో మళ్లీ తన ప్రతిభను నిరూపించుకుంది. ఈ సినిమా పెద్ద హిట్టైనప్పటికీ, ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మరోవైపు,తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం ఆమెకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి.కానీ ఇటీవల వచ్చిన భోళా శంకర్ సినిమా మరోసారి నిరాశపరిచింది.
డిసెంబర్ మొదటి వారంలో గోవాలో వివాహ వేడుక
తాజాగా, ఆమె రఘు తాత వెబ్ సిరీస్ ద్వారా కొంత రీలీఫ్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు కీర్తి తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. డిసెంబర్ మొదటి వారంలో గోవాలో ఆమె వివాహ వేడుక ఘనంగా జరగనుందని సమాచారం. 15 ఏళ్ల బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మార్చుకుంటున్న కీర్తి, కొత్త జీవితానికి పునాది వేయబోతోంది.