
Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్థానీ కాల్పులు.. నిర్వాహకుల ఖండన
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకి చెందిన కెనడా కేఫ్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో 'కాప్స్ కేఫ్' పేరుతో కపిల్ శర్మ ఇటీవలే ఈ కేఫ్‌ను ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి (కెనడా సమయం ప్రకారం) ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ కారు నుంచి కేఫ్‌పై తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాల్పులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ తానే కాల్పులు జరిపినట్లు ప్రకటించాడు.
Details
అధికారిక ప్రకటన విడుదల
దీంతో దాడికి పాల్పడిన వారి కోసం కెనడా పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఈ నేపథ్యంలో 'కాప్స్ కేఫ్' నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. రుచికరమైన కాఫీ, స్నేహపూర్వక సంభాషణలతో కస్టమర్లకు మంచి అనుభవం కల్పించాలనే ఆశతో కేఫ్ ప్రారంభించాం. ఇలాంటి హింసాత్మక చర్యలు బాధాకరం. హింసను ఖండిస్తూ దృఢంగా ఎదుర్కొంటాం. ఏమాత్రం వెనక్కి తగ్గమంటూ తమ స్టాండ్‌ను స్పష్టంచేశారు. ఈ ఘటన అనంతరం తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ కేఫ్ యాజమాన్యం హృదయపూర్వకంగా స్పందించింది. ఈదాడి నేపథ్యం, ఉద్దేశ్యం, తదితర అంశాలపై అధికార సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. అప్పుడే ప్రారంభమైన కేఫ్‌పై దాడి జరగడం పట్ల బాలీవుడ్‌లోనూ తీవ్ర స్థాయిలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.