LOADING...
Rajpal Yadav: చెక్‌బౌన్స్‌ కేసులో తిహాడ్‌ జైలుకు 'కిక్‌ 2' నటుడు
చెక్‌బౌన్స్‌ కేసులో తిహాడ్‌ జైలుకు 'కిక్‌ 2' నటుడు

Rajpal Yadav: చెక్‌బౌన్స్‌ కేసులో తిహాడ్‌ జైలుకు 'కిక్‌ 2' నటుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన తిహాడ్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఈ నెల 2వ తేదీలోగా సరెండర్‌ కావాలని న్యాయస్థానం ఇటీవల ఆదేశించగా, గడువు పొడిగించాలని రాజ్‌పాల్‌ కోర్టును కోరారు. అయితే ఈ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు బుధవారం లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాంతో గురువారం సాయంత్రం రాజ్‌పాల్‌ యాదవ్‌ తిహాడ్‌ జైలులో సరెండర్‌ అయ్యారు

Details

కేసు నేపథ్యం ఇలా

మురళీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రాజ్‌పాల్‌ యాదవ్‌, ఆయన భార్యపై చెక్‌బౌన్స్‌ కేసు దాఖలు చేసింది. తమ వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోవడమే కాకుండా, ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయని ఆ సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన దిల్లీ మెజిస్ట్రేట్‌ కోర్టు 2018లో రాజ్‌పాల్‌ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాజ్‌పాల్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించినా, 2019లో ఆ కోర్టు కూడా మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పునే సమర్థించింది. దీంతో చివరకు ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 2024లో జైలు శిక్షపై తాత్కాలిక స్టే ఇస్తూ, ఫిర్యాదుదారుడితో రాజీ కుదుర్చుకోవాలని సూచించింది.

Details

నటుడిగా రాజ్‌పాల్‌ ప్రస్థానం

అప్పును చెల్లిస్తానని రాజ్‌పాల్‌ కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీలను నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా తుది ఆదేశాలు జారీ చేసి, వెంటనే లొంగిపోవాలని స్పష్టం చేసింది. హిందీ చిత్ర పరిశ్రమలో కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజ్‌పాల్‌ యాదవ్‌ 'హంగామా', 'షాదీ సే పహలే', 'భూల్‌ భూలయ్య', 'డ్రీమ్‌ గర్ల్‌ 2', 'బేబీజాన్‌' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో 'కిక్‌ 2' సినిమాతో అడుగుపెట్టిన ఆయన, మరాఠీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు తిహాడ్‌ జైలులో లొంగిపోయిన రాజ్‌పాల్‌ భవితవ్యం తదుపరి న్యాయ ప్రక్రియపై ఆధారపడి ఉంది.

Advertisement