
KOTA : రాజకీయాల్లోనూ కోట స్పెషల్ మార్క్.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌కు తీరని లోటు చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన కోటా, తనదైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా - విభిన్నమైన పాత్రల్లో జీవించి, విలన్ పాత్రలకు కొత్త అర్థం తెచ్చిన నటుడు కోట శ్రీనివాసరావు. సినీ రంగంలో అగ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఒత్తిడితోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు స్వతహాగా వాజ్‌పేయి మీద గొప్ప గౌరవం ఉండేది.
Details
1990లో బీజేపీలోకి చేరిక
అప్పట్లో సినీ ప్రముఖులు ప్రధానంగా తెలుగుదేశం లేదా కాంగ్రెస్ పార్టీలు పట్టించుకునేవారు. కానీ కోట మాత్రం భిన్నంగా ఆలోచించారు. 1990లలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన ఆయన, 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడంతో కోట రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నారు. తర్వాత మళ్లీ నటనపై దృష్టి సారించి వందల సినిమాల్లో నటించారు. తన నటనా ప్రతిభకు గుర్తింపుగా 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. నటుడిగా, నాయకుడిగా, మనిషిగా అనేక మలుపుల జీవితాన్ని చూసిన కోట శ్రీనివాసరావు ఇక శాశ్వత నిద్రకి చేరారు.