Mohanlal: 'లూసిఫర్ 2' షూటింగ్ పూర్తి.. అభిమానులకు మోహన్‌లాల్ స్పెషల్ మెసేజ్
మోహన్ లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన 'లూసిఫర్ 2: ఎంపురాన్' చిత్రీకరణ ముగిసింది. ఇది 2019లో వచ్చిన 'లూసిఫర్' సినిమాకు ప్రీక్వెల్ కమ్ సీక్వెల్. మోహన్‌లాల్ ఈ గుడ్ న్యూస్‌ను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ 14 నెలల పాటు సాగిందని, భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, యూఏఈ సహా నాలుగు దేశాల్లో చిత్రీకరణ జరిగిందని ఆయన చెప్పారు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణయమని, ప్రతి ఫ్రేమ్ గొప్పగా కనిపించేందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ తన సృజనాత్మకతను చూపించారని మోహన్ లాల్ కొనియాడారు.
వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్
ఈ కథకు మురళీ గోపి జీవం పోశాడని, తమ నిర్మాతల విశ్వాసం, టీమ్ మొత్తం ఇచ్చిన సహకారం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్పారు. చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టొవినో థామస్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో టీమ్ ఈ సినిమాను రూపొందించింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.