'Anti-Telugu' speech: అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరి శంకర్'కి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు
సీనియర్ నటి కస్తూరి శంకర్ తెలుగువారిపై చేసిన వ్యాఖ్యల కేసులో మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ చేసిన మదురై ధర్మాసనం గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. కస్తూరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తెలుగువారిని తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. తెలుగువారు తమిళనాడు అభివృద్ధిలో కీలకంగా ఉన్నారని, వారిని వలస వచ్చిన వారిగా చూడలేమని స్పష్టం చేసింది.
బ్రాహ్మణ సమాజం సమావేశంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
కస్తూరి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వ తరపు న్యాయవాది, పోలీసులను ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించారా లేదా అని కూడా అడిగింది. ఇటీవల చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సమాజం సమావేశంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 300 ఏళ్ల క్రితం రాజుల పాలనలో తమిళనాడులోకి సేవకులుగా వచ్చినవారు తెలుగువారేనని, ఇప్పుడు వారే తమిళులుగా చలామణి అవుతున్నారని కస్తూరి చెప్పడం పెద్ద దుమారం రేపింది.
కస్తూరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
కస్తూరి వ్యాఖ్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు, తమిళ ప్రజల మధ్య విభేదాలు పెంచేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు సమర్పించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెకు నోటీసులు ఇవ్వడానికి నివాసానికి వెళ్లగా, తాళం వేసి ఉండటంతో ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉండటంతో ఆమె అజ్ఞాతంలో ఉంది. తరువాత సోమవారం ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
నా మాటలు వక్రీకరించారు: కస్తూరి
మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచి, గురువారం దానిపై నిర్ణయం ప్రకటించారు. హైకోర్టులో ఊరట లభించకపోవడంతో నటి కస్తూరి అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలియరాలేదు. రెండు టీమ్‌లు ఆమె కోసం గాలిస్తున్నాయి. కస్తూరి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ, తెలుగు ప్రజలపట్ల, తెలుగు భాషపట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, కావాలనే తన మాటలను వక్రీకరించారని సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా వివరించారు.