
Mahavatar Narasimha: కూలీ, వార్-2 క్రేజ్‌ను దాటేసిన 'మహావతార్ నరసింహా'!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం థియేటర్లలో మూడు సినిమాలు హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'కూలీ', హృతిక్-ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా వచ్చిన 'వార్-2' సినిమాలు అత్యంత అంచనాలతో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు భారీ ఫ్యాన్‌బేస్, పెద్ద ప్రొడక్షన్ సంస్థలు, స్టార్ డైరెక్టర్లు ఉన్నందునే కాకుండా, ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుతూ జీవోలు కూడా జారీ చేశాయి. అయినప్పటికీ, ఈ రెండు సినిమాలను బాక్సాఫీస్ వద్ద 'మహావతార్ నరసింహా' మించిపోయింది. ఇప్పటికే నెల రోజులు గడిచినా కూడా 'మహావతార్ నరసింహా' క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బుక్ మై షోలో గంటకు ఆరు వేల టికెట్లకు పైగా అమ్ముడవుతుండటం ఈ చిత్రానికి ఉన్న పాపులారిటీని స్పష్టంగా చూపిస్తోంది.
Details
గంటకు 6వేలకు పైగా టికెట్లు బుకింగ్
సాధారణంగా ప్రజలు సినిమాలు సెలవు దొరికితే వెళ్తారు.'వార్-2', 'కూలీ' విషయంలో కూడా అదే పరిస్థితి. కానీ 'మహావతార్' మాత్రం ప్రేక్షకులు పనిగట్టుకుని థియేటర్లకు వెళ్లి చూస్తున్న సినిమాగా నిలిచింది. ప్రస్తుతం గంటకు 'కూలీ'కు సుమారు 5 వేల టికెట్లు, 'వార్-2'కు 3 వేలకుపైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. కానీ ఇవి రెండూ 'మహావతార్ నరసింహా' టచ్ చేయలేకపోతున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ పవర్, ఫ్యాన్ బేస్ ఉన్నా సరే, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లలోనే చూస్తారనే దానికి ఈ చిత్రం ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది.
Details
సాధారణ ధరల్లో మహావతార్ మూవీ
మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, అనిమేషన్ చిత్రాన్ని థియేటర్‌లో చూసే అనుభవమే వేరుగా ఉంటుంది. అందుకే 'మహావతార్' కోసం ప్రేక్షకులు థియేటర్లకే వస్తున్నారు. మరోవైపు, 'వార్-2', 'కూలీ' సినిమాలను మాత్రం ప్రేక్షకులు "ఓటీటీలో చూసేద్దాం" అని లైట్‌గా తీసుకుంటున్నారు. అలాగే ఆ రెండు సినిమాల టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం, 'మహావతార్' సాధారణ ధరల్లో అందుబాటులో ఉండటం కూడా ఆ చిత్ర విజయానికి తోడ్పడింది.