Loading...
Pakistan Cricket Board: పాక్‌ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. ఆకిబ్‌ జావెద్‌, వహాబ్‌ రియాజ్‌లకు ఉద్వాసన!
పాక్‌ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. ఆకిబ్‌ జావెద్‌, వహాబ్‌ రియాజ్‌లకు ఉద్వాసన!

Pakistan Cricket Board: పాక్‌ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. ఆకిబ్‌ జావెద్‌, వహాబ్‌ రియాజ్‌లకు ఉద్వాసన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు వరుస ఓటములతో నిరాశపరుస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఛైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ బోర్డులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్షాళనలో భాగంగా సీనియర్‌ సెలెక్టర్‌ ఆకిబ్‌ జావెద్‌, మహిళల జట్టు మెంటార్‌ వహాబ్‌ రియాజ్‌లను వారి బాధ్యతల నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. జాతీయ సెలక్షన్‌ కమిటీలో సీనియర్‌ సెలెక్టర్‌గా ఉన్న మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆకిబ్‌ జావెద్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించనున్నారు. రెండేళ్లుగా పీసీబీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆకిబ్‌ జావెద్‌ ముఖ్యమైన పాత్ర పోషించారు.

వివరాలు

సిరీస్‌ మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లు వెనక్కి

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ 0-2తో వెనుకబడిన సమయంలో.. సిరీస్‌ మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లను వెనక్కి పంపించడం, కోచ్‌లను మార్చడం వంటి వివాదాస్పద నిర్ణయాల వెనుక కూడా అతడి పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది.

అయితే ఇకపై ఆకిబ్‌ జావెద్‌ను లాహోర్‌లోని హై పర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో డైరెక్టర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ పదవికే పరిమితం చేయవచ్చని సమాచారం.

మరోవైపు గత ఏడాది నుంచి పాకిస్థాన్‌ మహిళల జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న వహాబ్‌ రియాజ్‌ను కూడా బాధ్యతల నుంచి తప్పించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత మహిళల జట్టు కోచింగ్‌ సిబ్బందితో పాటు వహాబ్‌ రియాజ్‌ను కూడా బాధ్యతల నుంచి విడుదల చేయనున్నారు.

వివరాలు

'కఠిన చర్యలు అవసరం'

మహిళల జట్టుకు విదేశీ కోచ్‌లను నియమించే అంశాన్ని కూడా పీసీబీ పరిశీలిస్తోంది.

పాకిస్థాన్‌ క్రికెట్‌లో వరుస ఓటములు, అనూహ్య పరిణామాలకు ముగింపు పలకాలంటే కొన్ని కఠినమైన చర్యలు అవసరమని ఛైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ కూడా ఇప్పుడు గ్రహించారని బోర్డుకు చెందిన ఓ అంతర్గత అధికారి వెల్లడించారు.

''అందుకే ఈ మార్పులు అనివార్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ నిర్ణయాలను ఖరారు చేసే ముందు మొహ్సిన్‌ నఖ్వీ తన సహాయకులు, పాలకమండలి సభ్యులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను పాకిస్థాన్‌ 0-3 తేడాతో కోల్పోవడం, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పురుషుల, మహిళల జట్లు రెండూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పీసీబీ ఈ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT