LOADING...
2024 Oscar Race : ఆస్కార్‌ రేసులోకి మలయాళ బ్లాక్‌బస్టర్‌ '2018' సినిమా

2024 Oscar Race : ఆస్కార్‌ రేసులోకి మలయాళ బ్లాక్‌బస్టర్‌ '2018' సినిమా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 27, 2023
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ బ్లాక్ బస్టర్, 2018 సినిమా ఆస్కార్‌ 2024కి భారత్ నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ మేరకు పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ '2018'ను సెలెక్ట్ చేసింది. వచ్చే సంవత్సరం ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డ్స్ కు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో '2018'ని ఎంపికైంది. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. '2018 సినిమా కేరళలో సంభవించిన వరదల ఆధారంగా తెరకెక్కింది. కథాంశం ఆద్యంతం భావోద్వేగ భరితంగా సాగింది. మలయాళం సహా ఇతర దక్షిణాది భాషల్లోని సినీ ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం విశేషం.

DETAILS

ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో '2018' మూవీ

ప్రతి ఏడాది ప్రపంచ దేశాలు 'ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌' కేటగిరిలో తమ దేశానికి చెందిన ఉత్తమ చిత్రాలను అకాడమీకి నామినేట్ చేస్తాయి. దర్శకుడు గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ, చెన్నైలో సమావేశమైంది. ఈ మేరకు ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న చిత్రాలను వీక్షించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో '2018' మూవీని కమిటీ ఎంపిక చేసింది. అమీర్‌ఖాన్‌ హిందీ చిత్రం లాగాన్‌ తర్వాత ఏ భారతీయ చిత్రం కూడా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలవలేదు. గతంలో మదర్‌ ఇండియా, సలామ్‌ బాంబే చిత్రాలు మాత్రమే ఈ కేటగిరి బరిలో నిలిచాయి.