Loading...
Mamitha Baiju: మూడు వారాల్లో మూడు భాషలు.. మమిత బైజూ అరుదైన రికార్డు!
మూడు వారాల్లో మూడు భాషలు.. మమిత బైజూ అరుదైన రికార్డు!

Mamitha Baiju: మూడు వారాల్లో మూడు భాషలు.. మమిత బైజూ అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 22, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సూపర్ హిట్ 'ప్రేమలు' తెలుగు డబ్బింగ్ విడుదలైన తర్వాత నటి మమిత బైజూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు. ఆ ఒక్క సినిమా తర్వాత మమిత కెరీర్ వేగంగా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం అనే తేడా లేకుండా వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అనంతరం విడుదలైన 'డ్యూడ్' చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి ఆమె చూపించిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

వివరాలు

మూడు వారాల వ్యవధిలోనే విడుదల..

ప్రస్తుతం మమిత నటిస్తున్న చిత్రాల్లో పాత్రల వైవిధ్యం ప్రత్యేకంగా నిలుస్తోంది.

హీరోలు సూర్య, విజయ్ మధ్య వయస్సులో పెద్ద తేడా లేకపోయినా, ఇద్దరి సినిమాల్లోనూ ఆమె పూర్తిగా భిన్నమైన పాత్రల్లో కనిపించనుంది.

విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'జననాయగన్' సినిమాలో ఆయన కుమార్తె పాత్రలో నటిస్తున్న మమిత, మరోవైపు సూర్య ప్రధాన పాత్రలో వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో ఆయనను ప్రేమించే యువతిగా కనిపించనుంది.

ఇలా వరుసగా భిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు చిత్రాలు కేవలం మూడు వారాల వ్యవధిలో విడుదల కానున్నాయి.

వివరాలు

సినిమాపై భారీ అంచనాలు..

జూలై 23న 'జననాయగన్', ఆగస్టు 14న 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అంతేకాదు, ఆ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే, ఆగస్టు 21న మమిత నటించిన మరో మలయాళ చిత్రం 'బెత్లేహేమ్ కుటుంబం' విడుదల కానుంది.

'ప్రేమలు'తో ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు గిరీష్ ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో మమిత, యువ హీరో నివిన్ పౌలీ సరసన నటిస్తోంది.

గతంలో ఒకే నెలలో రెండు లేదా మూడు సినిమాలతో పలువురు హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒకేసారి మూడు వేర్వేరు భాషల్లో విడుదలకు సిద్ధమైన సినిమాలతో రావడం మమితకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

పారితోషికం మరింత పెరిగే అవకాశం..

'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు చిత్రం కాగా, 'జననాయగన్' తమిళంలో, 'బెత్లేహేమ్ కుటుంబం' మలయాళంలో రూపొందాయి.

దీంతో మూడు భాషల ప్రేక్షకులను ఒకేసారి పలకరించే అరుదైన అవకాశాన్ని మమిత సొంతం చేసుకుంది.

సినీ ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించిన మమిత, వరుసగా 15 సినిమాల్లో నటించినప్పటికీ, ఆమెకు అసలైన గుర్తింపు తీసుకొచ్చింది 16వ చిత్రం 'ప్రేమలు'.

ఆ సినిమా విజయంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె ఇప్పుడు తెలుగులోనూ బలమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

తెలుగు మార్కెట్‌లో స్టార్ హోదా దక్కితే బాలీవుడ్ అవకాశాలు కూడా పెరుగుతాయని, అదే సమయంలో పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT