Page Loader
Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు
సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు

Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసంలోకి ఓ వ్యక్తి ప్రవేశించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు రెండు రోజుల క్రితం జితేంద్ర కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు తాజాగా వెల్లడించారు.సల్మాన్‌ను కలవాలన్న ఉద్దేశంతోనే తాను ఇంట్లోకి వెళ్లినట్లు విచారణలో జితేంద్ర చెప్పినట్లు తెలుస్తోంది. ఈఘటనకు సంబంధించి పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం..ఈ నెల 20వతేదీ ఉదయం 10 గంటల సమయంలో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేంద్రను భద్రతా సిబ్బంది గుర్తించారు. అతడిని అక్కడినుంచి వెళ్లిపోవాలని చెప్పిన సమయంలో,జితేంద్ర కోపానికి గురై తన ఫోన్‌ను నేలకేసి విసిరేశాడు.అదే రోజు సాయంత్రం మళ్లీ అతడు సల్మాన్‌ ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు.

వివరాలు 

కారు వెనక దాగి లోపలికి ప్రవేశించి..

ఈసారి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మరో వ్యక్తి కారు వెనక దాగి లోపలికి ప్రవేశించాడు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకొని వెంటనే బాంద్రా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు జితేంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో అతడు ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చానని, సల్మాన్‌ ఖాన్‌ను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నానని చెప్పాడు. కానీ భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో కారు వెనక దాగి లోపలికి వెళ్లినట్లు తెలిపాడు.

వివరాలు 

కేసు నమోదు చేసిన పోలీసులు 

ఇక గత కొంత కాలంగా సల్మాన్‌ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుండి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం సల్మాన్‌ నివాసం గల బాంద్రా గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది. అంతకుముందు, పన్వేల్‌ ఫామ్‌హౌస్‌ లోకి కొందరు చొరబడేందుకు యత్నించిన ఘటన కూడా కలకలం రేపింది. ఈ తరహా బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం సల్మాన్‌ ఖాన్‌కు 'వై ప్లస్‌' స్థాయి భద్రత కల్పించింది. ప్రస్తుతం ఆయన ఈ భద్రత నడుమే తన సినిమా షూటింగులు, ప్రమోషన్లు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.