
Manchu Case : వస్తువుల దొంగతనం.. విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తన జలపల్లి నివాసంలో ఉన్న వస్తువులు, కార్లు తన అనుమతి లేకుండానే ఎత్తుకెళ్లారంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన అన్న మంచు విష్ణు, అతని అనుచరులు ఇంట్లోకి చొరబడి అక్రమంగా వస్తువులు తీసుకెళ్లారంటూ ఆరోపించారు.
ఈ విషయంపై పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చిన మనోజ్, నేడు తన కుటుంబంతో కలిసి జలపల్లి నివాసానికి చేరుకున్నాడు. అయితే అధికారులు ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు.
దీనిపై మనోజ్ ఆందోళనకు దిగాడు. కోర్టు అనుమతితోనే తాను ఇంట్లోకి వెళ్తున్నానని చెబుతున్నాడు. తన కారు సోదరుడు విష్ణు తీసుకెళ్లారని, ప్రస్తుతం తనకు మరో ఇల్లు లేకపోవడంతో తన ఇంటికి తిరిగి వచ్చానని అధికారులకు తెలిపాడు.
Details
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు
ఇటీవల తన కూతురి పుట్టినరోజు సందర్భంగా భార్యతో కలిసి రాజస్థాన్ వెళ్లిన మనోజ్, నిన్న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు.
అప్పటికే ఇంట్లో వస్తువులు, కారు కనిపించకపోవడంతో తన అనుచరుల ద్వారా సమాచారం తెలుసుకుని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక మనోజ్ జలపల్లి రానున్నాడన్న సమాచారం మేరకు అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకుండా నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకున్నారు.
కొన్ని నెలలుగా మంచు సోదరుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఎప్పటికి ముగుస్తాయో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.