Miss India 2026 Winner: గోవా సుందరి సాధ్వి సతీష్ సెయిల్‌కు మిస్ ఇండియా కిరీటం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన 'మిస్ ఇండియా 2026' (61వ ఎడిషన్) పోటీలు శనివారం రాత్రి భువనేశ్వర్‌లో ఘనంగా ముగిశాయి. 'పుత్రికాభిమానం' (Daughters of This Soil) థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సెయిల్ మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో గత ఏడాది విజేత నిఖిత పోర్వాల్ సాధ్వికి కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో సాధ్వి 'మిస్ వరల్డ్ 2027' పోటీల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందారు. ఈ కార్యక్రమానికి మనీష్ పాల్, సారా జేన్ డియాస్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా ఇషాన్ ఖట్టర్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వివరాలు
రన్నరప్ గా రాజనందిని పవార్
టాప్-3లో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సెయిల్ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె సిల్వర్-బ్లాక్ మోనోక్రోమాటిక్ గౌనులో మెరిసిపోయారు. హై-నెక్, స్లీవ్‌లెస్ డిజైన్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఫస్ట్ రన్నరప్‌గా మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ నిలిచారు. ఆమె పింక్ కలర్ గౌనులో 'మోడ్రన్ ప్రిన్సెస్'లా ఆకట్టుకున్నారు. వెండి స్పటికాలు, రాళ్లతో అలంకరించిన హాల్టర్-స్టైల్ గౌను, ప్రత్యేక హెయిర్ స్టైల్ ఆమెకు క్లాసిక్ లుక్‌ను ఇచ్చాయి. సెకండ్ రన్నరప్‌గా శ్రీ అద్వైతం నిలిచారు. గోల్డ్ కలర్ ఈవినింగ్ గౌనులో ఆమె తళతళలాడగా, సిల్వర్ ఇయర్ రింగ్స్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి. అందం, తెలివితేటలు, సమయస్ఫూర్తిని ప్రతిబింబించిన ఈ ముగ్గురు విజేతలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.