ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ మళ్లీ తెరపైకి: 800 మూవీ మోషన్ పోస్టర్ వచ్చేసింది
2020సంవత్సరంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటూ ప్రకటన వచ్చింది. 800 అనే టైటిల్ తో రూపొందే ఈ మూవీ నుండి మోషన్ పోస్టర్ కూడా వచ్చింది. కానీ తమిళుల నుండి వ్యతిరేకత రావడంతో విజయ్ సేతుపతి, ఆ సినిమా నుండి వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత 800మూవీ గురించి మళ్ళీ ఎలాంటి విషయమూ బయటకు రాలేదు. తాజాగా మురళీధరన్ పుట్టినరోజును పురస్కరించుకుని 800మూవీ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అవును, ముత్తయ్య మురళీధరన్ జీవితం వెండితెర పైకి రాబోతుంది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ కనిపించనున్నాడు. మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
మూడు భాషల్లో రిలీజ్ అవుతున్న 800మూవీ
ముత్తయ్య మురళీధరన్ పోలికలతో మధుర్ మిట్టల్ సరిగ్గా సరిపోయాడు. ఎమ్ ఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై వివేక్ రంగాచారి నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆర్ డీ రాజశేఖర్ కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. విడుదల ఎప్పుడు ఉంటుందనేది వెల్లడిచేయలేదు. శ్రీలంక క్రికెటర్ మురళీధరన్, టెస్ట్ క్రికెట్ లో 800వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మురళీధరన్ బయోపిక్ పై గతంలో చాలా వివాదమైంది. ఈసారి కూడా అలాంటి వివాదం తెరపైకి వస్తుందేమోనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.