రంగబలి ట్రైలర్: కామెడీ, రొమాన్స్, యాక్షన్ కథలో నాగశౌర్య
నాగశౌర్య హీరోగా నటిస్తున్న రంగబలి సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. గత కొన్ని రోజులుగా మాస్ సినిమాల మీద దృష్టి పెట్టిన నాగశౌర్య, రంగబలి తో పక్కా మాస్ సినిమాతో వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నింటినీ మేళవించి రంగబలి ట్రైలర్ లో చూపించారు. సొంతూరును అమితంగా ఇష్టపడే క్యారెక్టర్ లో నాగశౌర్య కనిపిస్తున్నట్లు ట్రైలర్ లో అర్థమవుతోంది. హీరో ఫ్రెండ్ గా నటిస్తున్న సత్య క్యారెక్టర్ ప్రేక్షకులను నవ్వించనుందని చూపించారు. నాగశౌర్య, హీరోయిన్ యుక్తి తరేజాల మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకునేలా ఉండనున్నట్లు అనిపిస్తోంది.
మాస్ పాత్రలో ఇమిడిపోయిన నాగశౌర్య
అసలు కథేంటనేది ట్రైలర్ లో తెలియడం లేదు కానీ సొంతూరుకు సంబంధించి ఏదో ఇబ్బంది హీరోకు ఎదురవబోతుందని, దానిమీదే సినిమా కథ నడుస్తుందని ట్రైలర్ చూసాక ప్రతీ ఒక్కరూ ఫీలవుతారు. మాస్ క్యారెక్టర్ లో నాగశౌర్య చాలా ఈజీగా నటించేసినట్లు అనిపిస్తోంది. బాగా సూట్ అయ్యింది కూడా. కమర్షియల్ సినిమాకు ఉండే పాజిటివ్ అంశాలు రంగబలి ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, గోపరాజు రమణ, దసరా విలన్ షైన్ టామ్ చాకో నటిస్తున్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు, పవన్ సీ హెచ్ సంగీతం అందిస్తున్నారు. జులై 7వ తేదీన రంగబలి రిలీజ్ అవుతుంది.