రంగబలి టీజర్: కామెడీ, యాక్షన్ కలయికతో సరికొత్తగా కనిపిస్తున్న నాగశౌర్య
కొన్నిరోజుల క్రితం తెలుగు సినిమా హీరో అంటే అల్లరి చిల్లరగా ఉండేవాడు. ఆ క్యారెక్టరైజేషన్ ని ప్రేక్షకులు ఇష్టపడేవారు. అయితే గతకొన్ని రోజులుగా అలాంటి క్యారెక్టరైజేషన్ తో సినిమాలు ఎక్కువగా రాలేదు. నాగశౌర్య కొత్త చిత్రం రంగబలి, అదే ఫార్ములాతో వస్తున్నట్లుగా ఈరోజు రిలీజైన టీజర్ చూస్తే అర్థమవుతోంది. రంగబలి అనే టైటిల్ లో కనిపించిన మాసీనెస్, నాగశౌర్య క్యారెక్టర్ లో కనిపించింది. ముందుగానే చెప్పినట్టు హీరో పాత్ర అల్లరి చిల్లరగా ఉంటుంది. తండ్రికీ కొడుక్కీ పడదు. హీరోయిన్ మాత్రం మంచి చదువుకున్న అమ్మాయి. టీజర్ చూస్తుంటే మంచి వినోదం పంచేలా కనిపిస్తోంది. సినిమా కూడా అలానే ఉంటుందా లేదా అనేది రిలీజైతే కానీ చెప్పలేం.
దసరా మూవీ నిర్మాతలు తెరకెక్కించిన మూవీ
రంగబలి సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా కనిపిస్తోంది. దసరా మూవీ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రంగబలి తెరకెక్కింది. సుధాకర్ రెడ్డి చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పవన్ బాసంశెట్టి డైరెక్ట్ చేస్తున్నారు. లవ్ స్టోరీ చిత్రంతో మ్యూజిక్ దర్శకుడిగా మారిన పవన్ సీహెచ్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సత్య తదితరులు నటిస్తున్న ఈ సినిమా, జులై 7వ తేదిన థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి సినిమాతో అపజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య, రంగబలి సినిమాతో విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.