LOADING...
Nagabandham Trailer : 'నాగబంధం' ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న అద్భుతమైన విజువల్స్

Nagabandham Trailer : 'నాగబంధం' ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న అద్భుతమైన విజువల్స్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 19, 2026
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో, నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటిస్తున్న తాజా చిత్రం 'నాగబంధం'. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా, అనంత పద్మనాభ స్వామి ఆలయం, అక్కడి 'నాగబంధం' భావన ఆధారంగా సృష్టించిన కల్పిత కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

వివరాలు

విజువల్ గ్రాండియర్‌పై మరింత ఆసక్తి..

ఇటీవల విడుదలైన 3 నిమిషాల 19 సెకెన్ల ట్రైలర్ సినిమా స్థాయి, కథా నేపథ్యం, విజువల్ గ్రాండియర్‌పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. యాక్షన్‌తో పాటు సస్పెన్స్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. కథలో కీలకంగా నిలిచే 'బ్రహ్మ కమలం' అనే బంగారు పుష్పం చుట్టూ ఉన్న రహస్యమే సినిమా ప్రధానాంశమని ట్రైలర్ స్పష్టం చేసింది. ముఖ్యంగా, "గుప్తనిధుల్లో దాగి ఉన్న ఖజానా భూమిని మాత్రమే శాసిస్తుంది. కానీ బ్రహ్మ కమలం మాత్రం బ్రహ్మాండాన్నే శాసించే శక్తి కలిగి ఉంటుంది" అనే సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వివరాలు

సినిమాపై భారీ అంచనాలు..

గుప్తనిధుల అంశాన్ని పురాణ, ఇతిహాస కథనాలతో అనుసంధానిస్తూ, విష్ణు దేవాలయాల చుట్టూ నెలకొన్న రహస్యాలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా ఆవిష్కరించారు. సినిమా ప్రారంభం నుంచే విరాట్ కర్ణ పాత్రను పరమశివుడి ఉగ్రరూపానికి ప్రతీకగా పరిచయం చేస్తున్న చిత్రబృందం, ట్రైలర్‌లో ఆ పాత్రను మరింత ప్రభావవంతంగా ఎలివేట్ చేసింది. మొత్తంగా చూస్తే, వేల సంవత్సరాల నాటి ఓ గూఢ రహస్యం, ఒక వ్యక్తి స్వార్థం, ఆ స్వార్థం వల్ల సంభవించిన విధ్వంసం, అలాగే "వినాశకాలే విపరీత బుద్ధి" అనే భావాన్ని ప్రతిబింబించేలా దర్శకుడు కథను మలిచినట్లు ట్రైలర్ సూచిస్తోంది. భారీ సెట్లు, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, శక్తివంతమైన నటన, సాంకేతిక విలువలతో రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచింది.

Advertisement