Nagarjuna : నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్ ప్లాన్ తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమలో కింగ్ నాగార్జునకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వయస్సు పెరుగుతున్నా.. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. ఆయన ఆరోగ్యం, ఫిట్‌నెస్, యంగ్ లుక్ వెనుక ఉన్న కొన్ని ఆసక్తికర విషయాలను నాగార్జునకు చాలా కాలంగా మేకప్ మ్యాన్‌గా పనిచేసిన చంద్ర వెల్లడించారు. నాగార్జున లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, శరీరాన్ని కాపాడుకునే విధానం ఎంతో క్రమశిక్షణతో ఉంటాయని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఐదు రోజులు నాగార్జున సాధారణ ఆహారాన్నే తీసుకుంటారని చంద్ర చెప్పారు. అయితే ఆహారాన్ని మాత్రం చాలా పరిమితంగా తీసుకుంటారని తెలిపారు. ఉదయం అల్పాహారంగా ఒక ఇడ్లీ, లేదా ఒక వడ, లేదా ఒక గారె మాత్రమే తింటారని చెప్పారు.
వివరాలు
డైట్ ప్లాన్ ఇదే..
ఆకలి వేసినప్పుడే నాగార్జున భోజనం చేస్తారని.. ఆకలి లేకపోతే ఆహారం తీసుకోరని వెల్లడించారు.
మధ్యాహ్న భోజనంలోనూ నాగార్జున కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలను పాటిస్తారట.
ఆయన భోజనంలో ప్రతిరోజూ బెండకాయ కూర తప్పనిసరిగా ఉంటుందని చంద్ర తెలిపారు.
హాట్ చిప్స్ కూడా తీసుకుంటారని చెప్పారు. అన్నం విషయానికి వస్తే.. నాగార్జునకు దంపుడు బియ్యం అంటే ఇష్టమట.
దీనితో పాటు రసం, ఒక అరటిపండు కూడా తీసుకుంటారని తెలిపారు.
ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను కూడా చాలా తక్కువ పరిమాణంలోనే తీసుకుంటారని చెప్పారు.
ముఖ్యంగా నాగార్జునకు అన్నం చాలా మెత్తగా, చిమిడిపోయినట్లు ముద్దగా ఉండటం ఇష్టమట.
సాధారణంగా తినడానికి కష్టంగా అనిపించేంత మెత్తగా అన్నం ఉండాలని ఆయన కోరుకుంటారని చంద్ర వెల్లడించారు.
వివరాలు
శని, ఆదివారాల్లో ఏం తింటారంటే..
శనివారం రాత్రి నాగార్జునకు పమ్ఫ్రట్ చేప అంటే చాలా ఇష్టమట. తెలుగులో దీనిని చందువ చేప అని పిలుస్తారు.
ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లిన సమయంలోనూ చంద్ర స్వయంగా ఈ చేపను నాగార్జున కోసం వండి పెట్టేవారట.
ఈ చేపను నాగార్జున ఎంతో ఇష్టంగా తింటారని.. ఒక్కోసారి ఒకటి రెండు చేపలు కూడా తినేవారని చంద్ర తెలిపారు.
అయితే రొయ్యలు, ఇతర సీఫుడ్ అంటే నాగార్జునకు అంతగా ఇష్టం లేదని చెప్పారు.
ఆదివారం మాత్రం మటన్ లేదా చికెన్ రెండు మూడు ముక్కలు మాత్రమే తీసుకుంటారని వెల్లడించారు.
ఇతర రోజులతో పోలిస్తే ఆదివారం కాస్త ఎక్కువగా తింటారని తాను భావిస్తున్నట్లు చంద్ర పేర్కొన్నారు.
వివరాలు
నాగ్ తీసుకునే జ్యూసులు ఇవే..
ఇక నాగార్జున ఫిట్‌నెస్‌లో జిమ్‌ది కీలక పాత్ర. ఆయన నిత్యం జిమ్ చేస్తారని చంద్ర తెలిపారు.
అంతేకాదు.. ఉదయం పరగడుపున ఒక పెద్ద రాగి గ్లాసు నిండా ప్రత్యేకమైన జ్యూస్‌ను తీసుకుంటారట.
ఇందులో నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్‌రూట్, తెల్ల పటికబెల్లం ముక్క లేదా తేనె వేస్తారని చెప్పారు.
ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి జ్యూస్‌గా తయారు చేసి.. షూటింగ్‌కు వచ్చిన వెంటనే నాగార్జునకు మొదటగా ఇచ్చేవారట చంద్ర.
ఈ జ్యూస్ తీసుకోవడం వల్లే నాగార్జున జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉందని చంద్ర తెలిపారు.
ముఖ్యంగా ఉసిరికాయ, క్యారెట్ వంటి పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు.