వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్: చైతన్య ఎక్కడంటూ నీహారిక పోస్టుపై కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
మెగా ఇంట్లో పెళ్ళి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నిశ్చితార్థం, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జూన్ 9వ తేదీన జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నిశ్చితార్థానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వరుణ్ తేజ్ సోదరి నీహారిక, తన ఇన్స్ టా అకౌంట్ లో వరుణ్ తేజ్, లావణ్యతో కలిసి దిగిన తన ఫోటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ అందరూ నీహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ ఎక్కడ అంటూ అడగడం మొదలెట్టారు. ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫోటోల్లో చైతన్య ఎక్కడా కనిపించలేదు.
పెళ్ళి తర్వాత నీహారిక నటించిన సిరీస్
ఎంగేజ్మెంట్ లో చైతన్య కనిపించకపోవడంతో, నీహారిక, చైతన్య బంధం గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. నీహారికా, చైతన్య జొన్నలగడ్డ వివాహం 2020సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో జరిగింది. అయితే గతకొంత కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని పుకార్లు పుట్టుకొచ్చాయి. పెళ్ళికి ముందు సినిమాలు, సిరీస్ లు, టీవీ షోస్ లో నీహారిక కనిపించింది. పెళ్ళి తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్ లో నటించింది. వైవా హర్ష, అక్షయ్ లాగుసాని, సాయి రోనక్ నటించిన ఈ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.