స్వయంభు: యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి వియత్నాం వెళ్తున్న నిఖిల్
కార్తికేయ 2 సినిమా తర్వాత హీరో నిఖిల్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే పాన్ ఇండియా సబ్జెక్టులని ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో స్వయంభు కూడా ఒకటి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. తాజా సమాచారం ప్రకారం స్వయంభు సినిమా కోసం హీరో నిఖిల్ వియత్నాం వెళ్లనున్నాడని తెలుస్తోంది. వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, ఇంకా ఇతర యుద్ధ విద్యలు నేర్చుకోనున్నాడని టాక్ వినిపిస్తోంది. స్వయంభు సినిమాలో యోధుడిగా కనిపించడానికి అవసరమైన అన్ని విద్యలను నెల రోజులపాటు వియత్నాంలో శిక్షణ తీసుకోనున్నాడని సమాచారం.
స్వయంభు సినిమాకు సంగీతం అందిస్తున్న కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్
అంతేకాదు, శారీరకంగా మరింత ఫిట్ అవ్వడానికి నిఖిల్ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. నిఖిల్ తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని పాత్రను స్వయంభు సినిమాలో చేస్తున్నాడు. పౌరాణికం, చరిత్ర కలగలిపిన ఫాంటసీ కథతో స్వయంభు తెరకెక్కుతోందని ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. నిఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదలైన స్వయంభు ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న స్వయంభు సినిమాను భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కెమెరా బాధ్యతలను మనోజ్ పరమహంస నిర్వర్తిస్తున్నారు.